అయ్యో.. ఏమైందో ఏమో! | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఏమైందో ఏమో!

Published Wed, Jan 11 2023 7:17 AM

Elderly Couple Died In Suspicious After Coming For Labor Work - Sakshi

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌: కూలి పనికోసం వలస వచ్చిన వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాత్రి పడుకున్న మంచంపైనే తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ధన్వాడ మండ లం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన నాగారం హను మంతు (65), భార్య వెంకటమ్మ(50)తో కలిసిఅబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మజీద్‌పూర్‌లో సుగుణ అనే మహిళా రైతు వద్ద హార్టీకల్చర్‌ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారు.

రోజు మాదిరిగానే సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం ఇంకా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో సుగుణ వారిని పిలిచేందుకు వెళ్లింది. లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో పాటు దంపతులిద్దరూ స్పందించకపోవడంతో అనుమా నం వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. దీంతో కొంతమంది వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా హనుమంతుదంపతులు మంచంపై విగతజీవులుగా కనిపించారు.

పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతుల కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.  

(చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!)

Advertisement

తప్పక చదవండి

Advertisement