
హైదరాబాద్: నగరాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా.. డ్రగ్స్ మూలాలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. తాజాగా హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటమే ఇందుకు ఉదాహరణ. సుమారు 10 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఒక అపార్ట్‌మెంట్ వేదికగా ఐదురుగు కలిసి డ్రగ్స్ తయారీ చేస్తున్న సమాచారం అందుకున్న ఈగల్ టీమ్.. ఈ మేరకు సోదాలు నిర్వహించింది.
జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయి దత్తా రెసిడెన్సీలో 220 కేజీల డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని అరెస్ట్ చేయగా, ఒకరు పరారయ్యారు. ఈ డ్రగ్స్ విలువ స్థానిక మార్కెట్‌లో రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని అదే అంతర్జాతీయ మార్కెట్‌లో అయితే రూ. 70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అపార్ట్‌మెంట్ వేదికగా డ్రగ్స్ తయారు చేస్తున్న వారిలో వాస్తవాయి శివరామకృష్ణ పరమ వర్మ, దంగేటి అనిల్, మద్దు వెంకట కృష్ణ, ఎం ప్రసాద్, ముసిని దొరబాబులు ఉన్నారు. వీరంతా కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు కాగా, హైదరాబాద్‌లో ఉంటూ ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.