దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు విచారణ

Disha Encounter Case Justice Sirpurkar Commission Will Inquire - Sakshi

నిందితుల కుటుంబ సభ్యులకు సమన్లు 

18 మంది సాక్షులను విచారించనున్న కమిషన్‌ 

నిందితుల ఇళ్లవద్ద పోలీసు బందోబస్తు

సాక్షి, హైదరాబాద్‌/మక్తల్‌: సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ నేడు విచారించనుంది. గురువారమే విచారణ జరగాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది.  కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని నిందితుల కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేశారు. త్రిసభ్య కమిటీ 18 మంది సాకులను విచారించనుంది. ఇదిలాఉండగా..తమకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని నిందితుల కుటుంబసభ్యులు బుధవారం కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్‌కుమార్, శివల కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో.. 
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఆరీఫ్‌ తండ్రి హుస్సేన్, నవీన్‌కుమార్‌ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రా జప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణు కలు బుధవారమే ఇళ్ల నుంచి వెళ్లిపోయారని.. రెం డురోజుల నుంచి హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. అయితే వీరిని విచారణకు హాజరుకావొద్దని పోలీసులు బెదిరిస్తున్నారని జొళ్లు రాజప్ప ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 21న ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు దేవరకద్ర రోడ్‌ వద్ద బస్సుకోసం నిలబడగా..నంబరుప్లేటు లేని ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి ఢీకొట్టేందుకు ప్రయత్నించగా..రోడ్డు కిందికి దిగిపోవటంతో దగ్గరకొచ్చి బెదిరించారని తెలిపారు. కేసువాపసు తీసుకోకపోతే చింతకుంట కుర్మప్ప (చెన్నకేశవులు తండ్రి)కు పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించారని ఆరోపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top