అప్పుల బాధలు: గతంలో భర్త, చిన్నకుమారుడు, అల్లుడు.. ఇప్పుడేమో

Debt Tragedy: Family Commit Suicide Sad Story In Khammam - Sakshi

సాక్షి, పాల్వంచ(ఖమ్మం): అప్పుల బాధ తాళలేక, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన విషయం విదితమే. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్య ఓ కుమార్తె మృతి చెందగా, మరో కుమార్తె సాహితి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది.

అయితే, రామకృష్ణ తన కుటుంబీకులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సమయంలో మరో గదిలో నిద్రిస్తున్న ఆయన తల్లి సూర్యావతి మంటల్లో కాలిపోతున్న కొడుకు, కోడలు, మనవరాళ్ల పరిస్థితిని కళ్లారా చూసింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడంతో వారు మంటల్లో మాడిపోయారు. ఈ దృశ్యాలు కళ్ల ముందే కదలాడుతుండగా సూర్యావతి గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఆమెను పలకరించగా..కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుటుంబ స్థితిని వెల్లడించింది.

గతంలో రెండు మరణాలు..
సూర్యావతి భర్త చిట్టెబ్బాయ్‌ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెంలో వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. 1992లో ఆయన ప్రయాణిస్తున్న జీప్‌లో తహసీల్దార్‌ ఎక్కగా.. తహసీల్దార్‌ లక్ష్యంగా మావోలు పేల్చిన మందుపాతరలో చిట్టెబ్బాయ్‌ కూడా మృతి చెందారు. ప్రస్తుతం కుమారుడు, కోడలు మాదిరిగానే మాంసం ముద్దగా ఇంటికి మృతదేహం వచ్చిందని సూర్యావతి బోరున విలపించింది.

అంతేగాక చిన్న కారణంతో క్షణికావేశానికి లోనైన చిన్న కుమారుడు సురేష్‌ 1999లో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడని గుర్తు చేసుకుంది. ఇక మిగిలిన కొడుకు నాగ రామకృష్ణ, కోడలు, పిల్లలను అపురూపంగా చూసుకుంటున్నట్లు తెలిపింది. అయితే, వ్యాపారాల్లో నష్టపోవడమే కాక ఇష్టమొచ్చిన చోట అప్పులు చేసినా విషయం తనకు ఏనాడూ చెప్పలేదని వాపోయింది.

తీరా రూ.30లక్షలు ఇవ్వాలని, లేదంటే ఇళ్లు అమ్మాలని అడుగుతుండడమే కాక నెలనెలా రూ.వేలల్లో డబ్బు ఇవ్వాలని గొడవ చేసేవాడని తెలిపింది. ఆస్తి పంపకాల్లోనూ తాను అన్యాయం చేయలేదని, డబ్బు వృథా చేయొద్దని మాత్రమే చెప్పానని వెల్లడించింది.

హైదరాబాద్‌లో ఉన్న ఇంటి స్థలాన్ని కూడా అతడికే ఇవ్వగా, రెండు, మూడు రోజుల్లో అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరో చెప్పిన మాటలు నమ్మి తనతో పాటు సోదరిపై కక్ష పెట్టుకుని అన్యాయంగా కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడని రోదిస్తోంది. ఇప్పుడు తనకు దిక్కెవరని ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టించింది. కాగా, సూర్యావతి కూతురు భర్త సైతం కరోనాతో మృతి చెందడం గమనార్హం.

చావుబతుకుల మధ్యే సాహితి
మంటల్లో కాలిపోయి రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతి చెందగా.. మరో కుమార్తె సాహితి మాత్రం ప్రాణాపాయ స్థితిలో బయటపడింది. ఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో నుండి బయటకు పరుగెత్తుకొచ్చింది. తనను ఎవరైనా కాపాడుతారని, ఆస్పత్రికి తీసుకెళ్తారని ఆశగా ఎదురుచూసింది.

అయితే, చుట్టుపక్కల వారు, ఫైర్‌ ఇంజన్, పోలీసులు, అంబులెన్స్‌ వచ్చే సరికి గంటకు పైగా సమయం పట్టడం, ఆమెపై సకాలంలో నీళ్లు పోసి కాపాడకపోవడంతో ఒళ్లంతా కాలిపోయి చావుబతుకుల మధ్యే కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, 90శాతానికి పైగా సాహితి శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 

ముగిసిన అంత్యక్రియలు
నాగ రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతదేహాలు మంటలో మాడిపోయాయి. ఈ మేరకు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం పాత పాల్వంచ హిందూ శ్మశాన వాటికలో ముగ్గురి అంత్యక్రియలను నాగరామకృష్ణ భార్య శ్రీలక్ష్మి సోదరుడు జనార్దన్‌ పూర్తిచేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top