దూకుడే ప్రాణాలు తీసింది

With The Death Of Two Young Men Turned Into Bit Of Tragedy - Sakshi

మారేడుమిల్లి: ఇద్దరు యువకుల మృతితో విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నుంచి వచ్చిన ఆరుగురు యువకుల్లో కాళిదాస్‌ సందీప్‌ (24), దాన అరుణ్‌ కుమార్‌ (22 ) ఆదివారం పాములేరు వాగులో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. వాగులో స్నానం ప్రమాదకరమని హెచ్చరికలున్నా దూకుడుగా వ్యవహరించి దిగడం వల్లే ప్రాణాలు కోల్పోయారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మృతుల్లో సందీప్‌ డిగ్రీ పూర్తి చేశారు. అరుణ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తోటి స్నేహితులు తెలిపారు.  

వల్లూరు.. కన్నీరు. 
వాగుల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకుల స్వగ్రామం మండలంలోని వల్లూరు కన్నీరుమున్నీరైంది. రెండు ఆటో కార్మిక కుటుంబాలను పెను విషాదంలో ముంచింది. మండలంలోని వల్లూరుకు చెందిన మృతులు కాళిదాస్‌ సందీప్‌ (20), దాన అరుణ్‌కుమార్‌ (22) అవివాహితులు. అరుణ్‌ కుమార్‌ తండ్రి సత్యనారాయణ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సీత గృహిణి. వీరికి ముగ్గురు కొడుకులు. ఆఖరి కొడుకైన అరుణ్‌ కుమార్‌ కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

పాములేరు ఘటనలో మృత్యువాత పడ్డాడు. విహారానికి వెళ్లి విగత జీవిగా మిగిలావా అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. మరో మృతుడు సందీప్‌ తండ్రి చంటిదొర కూడా ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి మేరీ కువైట్‌లో ఉంటోంది. ఐదు నెలల క్రితం అక్కడకు వెళ్లింది. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ పాములేరు వెళ్లారు. పెద్ద కుమారుడైన సందీప్‌ వాగుకు బలయ్యాడు. నిత్యం ఎంతో సందడిగా ఉండే సందీప్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు గుండెలు బద్దలయ్యేలా రోదిస్తున్నారు.

(చదవండి: ఇన్ఫోసిస్‌ @ వైజాగ్‌!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top