ఐటీ ‘రిటర్న్స్‌’నూ మళ్లించేశారు..! 

Cyber Criminals Squandered Sums Owed To Taxpayers From IT Department - Sakshi

బెనిఫిషియరీ ఖాతాలు మార్చేస్తూ నగదు స్వాహా

ఓ వ్యక్తికి రావాల్సిన రూ. 21 లక్షలను కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారులకు తిరిగి రావాల్సిన మొత్తాలను సైబర్‌ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. సిటీ కేంద్రంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్న చార్టెడ్‌ అకౌంటెంట్‌కు దేశ వ్యాప్తంగా క్లైంట్స్‌ ఉన్నారు. వారిద్వారా మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రవాస భారతీయుడు (ఎన్నారై) పరిచయమయ్యారు. కాలిఫోర్నియాలో ఉండే ఆయన తన ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలనడంతో సీఏ అంగీకరించారు. 

ఎన్నారైకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రావాల్సిన రూ. 21 లక్షలను పుణేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పంపాలంటూ వాటిలో పొందుపరిచారు. సదరు ఖాతా నంబర్‌ ఐటీ రికార్డుల్లోనూ ఉంది. నిర్ణీత గడువు ముగిసినా తనకు రావాల్సిన డబ్బు రాలేదని సీఏ దృష్టికి ఎన్నారై తీసుకెళ్లారు. సీఏ ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు.  పరిశీలించిన అధికారులు సదరు ఎన్నారైకి రావాల్సిన రూ. 21 లక్షలను కొన్ని నెలల క్రితమే చెల్లించామంటూ సమాధానం ఇచ్చారు. అవాక్కైన సీఏ ఆ డబ్బు పంపిన ఖాతా వివరాలు తెలపాల్సిందిగా ఐటీ కాల్‌ సెంటర్‌ను సంప్రదించారు. 

వారందించిన వివరాల మేరకు విశాఖపట్నం ద్వారకానగర్‌లోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకును సీఏ సంప్రదించారు. ఆ ఖాతాలోకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 21 లక్షలు జమయ్యాయని, ఆ మొత్తాన్ని ఖాతాదారు డ్రా చేసేసినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. ఆ ఖాతాను సైబర్‌ నేరగాళ్లు కాలిఫోర్నియాలో ఎన్నారై పేరు, వివరాలతోనే ఓపెన్‌ చేసి.. ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లోకీ జొప్పించారు. ఫలితంగానే రిటర్న్స్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ శాఖ అందులోకి బదిలీ చేసింది.‘చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈ సైబర్‌ నేరానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు అందిçస్తూ ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు లిఖిత పూర్వకంగా కోరాం’ అని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top