దారుణం: భర్తపై భార్య విషప్రయోగం | Sakshi
Sakshi News home page

దారుణం: భర్తపై భార్య విషప్రయోగం

Published Thu, Oct 1 2020 8:59 AM

Crime News: Wife Killed Husband In Jayashankar Bhupalpally - Sakshi

సాక్షి, కాటారం(జయశంకర్‌ భూపాలపల్లి): మూడుమూళ్లు, ఏడు అడుగుల బంధానికి కళంకాన్ని తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెంలో చోటు చేసుకుంది. ఆగస్టు 19న ఈ ఘటన చోటుచేసుకోగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. కాటారం సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.హతీరాం కేసు వివరాలను వెల్లడించారు. రేగులగూడెం గ్రామానికి చెందిన మారుపాక దేవేందర్‌(40), మారుపాక స్వప్నకు 12 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇదే క్రమంలో 2017లో మహాముత్తారం గ్రామానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్‌తో స్వప్నకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం దేవేందర్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆయనను అడ్డు తొలగించాలని స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్‌ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం కళ్యాణ్‌ పురుగుమందు విషపు గుళికలు స్వప్నకు అందించగా, ఆమె మద్యంలో కలిపి దేవేందర్‌కు ఆగస్టు 19న తాగించింది. మరుసటి రోజు ఉదయం దేవేందర్‌ వాంతులు, విరోచనాలు చేసుకొని మృతి చెందాడు. అయితే, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని దేవేందర్‌ తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాటారం సీఐ హతీరాం నేతృత్వంలో దర్యాప్తు చేపట్టగా, రసాయనిక పరీక్షల ఆధారంగా మృతుడిపై విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు స్పప్నపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. దీంతో బుధవారం స్వప్న, కల్యాణ్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement