Viral Video: ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా చిక్కాడు, కానీ, దర్జాగా ఏడు గేట్లు దాటుకుంటూ పారిపోయాడు

Colombian Drug Lord Escaping Jail Viral Video - Sakshi

వాడొక కరడు గట్టిన క్రిమినల్‌. డ్రగ్‌ సప్లయ్‌తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  

జువాన్‌ క్యాస్ట్రో అలియాస్‌ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్‌ డ్రగ్‌ డీలర్‌. నైరుతి కొలంబియా  నారినో ప్రావిన్స్‌లో 20 శాతం కొకైన్‌ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్‌ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్‌గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 

సిబ్బంది తొలగింపు
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్‌ అయ్యారు. హై లెవల్‌ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్‌ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైలు అధికారి మిల్టన్‌ జిమెనెజ్‌తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్‌ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్‌ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 

కంత్రిగాడు
జువాన్‌ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్‌ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్‌ లీవ్‌లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకుని కొత్త లుక్‌తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్‌ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్‌ క్యాస్ట్రో అలియాస్‌ మటాంబా మే 2021లో అరెస్ట్‌ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top