TDP.. తెలుగు డ్రగ్స్ పార్టీ | Sakshi
Sakshi News home page

బెంగుళూరు రేవ్ పార్టీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ

Published Fri, May 24 2024 6:29 PM

Chittoor TDP Leaders Hand In Bangalore Rave Party

బెంగళూరు కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్‌ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.

చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్‌ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్‌ నాయుడు ఉన్నట్లు తేలింది.  ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు.   వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.

కాగా, అంతకుముందు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్‌ చౌదరి, సుకుమార్‌ నాయుడులు సైతం ఇందులో  నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.

చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్‌ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్‌కుమార్‌నాయుడులు ఈ రేవ్‌ పార్టీకి డ్రగ్స్‌ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలో జరిగిన రేవ్‌ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.

మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్‌ అబూబక్కర్‌ సిద్ధికి, ఎల్‌.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్‌ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్‌ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

అంతా ఓ పద్ధతి ప్రకారం..  
వాసు బర్త్‌ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్‌ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్‌వర్డ్‌ ఇచ్చారు. వాసు బర్త్‌ డే పార్టీ అనే యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.

‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్‌ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్‌ సిటీ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్‌ రాకెట్‌ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.

ఈ ఘటనలో పోలీసులు సీజ్‌ చేసిన కార్లలో ఫార్చూనర్‌ కారు ఏపీ 39 హెచ్‌ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement