Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్‌ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే..

Chain Snatcher Umesh Kathik Arrested in Ahmedabad - Sakshi

సింగిల్‌ స్నాచర్‌ చిక్కాడు 

అహ్మదాబాద్‌ పోలీసుల అదుపులో ఉమేష్‌ ఖాతిక్‌ 

నేరం చేయడానికి ఎంత దూరమైనా వెళ్లే తత్వం

అవసరమైతే పోలీసులపైనే కేసులు పెట్టే నైజం 

గుజరాత్‌కు చెందిన అధికారికి గతంలో తిప్పలు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో ఎనిమిది నేరాలు చేసి పరారైన ‘సింగిల్‌ స్నాచర్‌’ ఉమేష్‌ ఖాతిక్‌ను అహ్మదాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిటీ నుంచి పరారైన ఇతగాడిని శనివారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని నగరానికి తీసుకువచ్చేందుకు సైబరాబాద్‌ పోలీసులు అహ్మదాబాద్‌కు వెళ్లారు. సొత్తు రికవరీ చేయడంతో పాటు ఇంకా ఏవైనా నేరాలు చేశాడా? అనే కోణంలో విచారణ చేయనున్నారు. గతంలో ఇతడిని అనేకసార్లు అరెస్టు చేసిన అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారితో ‘సాక్షి’ శనివారం ఫోన్‌లో మాట్లాడింది. ఈ నేపథ్యంలో  ఉమేష్‌కు సంబంధించిన కీలకాంశాలు ఆయన వెల్లడించారు. టార్గెట్‌ చేసిన నగరంలోని హోటళ్లలో బస చేయడం, చోరీ చేసిన వాహనంపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడటం సహా ఈ ఘరానా స్నాచర్‌కు సంబంధించిన వివరాలివీ.. 

రాజస్థాన్‌లో పాలి జిల్లాకు చెందిన ఉమేష్‌ కొన్నాళ్లు అహ్మదాబాద్‌లోని నారాయణ్‌పురలో నివసించాడు. అప్పట్లో మహారాష్ట్రలోని జల్గాం జిల్లాకు చెందిన సూర్యవంశీ అలియాస్‌ దీపక్‌తో కలిసి కొన్ని చోరీలు చేశాడు. 
ఈ కేసులకు సంబంధించిన 2015–16లలో అహ్మదాబాద్‌ పోలీసులకు చిక్కి వీరు జైలుకు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత ఒకరు రాజస్థాన్‌కు, మరొకరు సూరత్‌కు వెళ్లిపోయారు. కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఈ ద్వయం 2017 నుంచి చైన్‌ స్నాచింగ్స్‌ చేయడం మొదలెట్టింది.  
ఉమేష్‌ రాజస్థాన్‌ నుంచి బస్సు లేదా రైలులో దాదాపు 650 కి.మీ. దూరంలో ఉన్న సూరత్‌ చేరుకునే వాడు. ఇద్దరూ కలిసి తొలుత ఓ వాహనం చోరీ చేసి దానిపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడ్డారు. రెండు మూడు నేరాలు చేసిన తర్వాత ఉమేష్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కారు కొన్నాడు. అప్పటి నుంచి దాని మీదే సూరత్‌ వచ్చే వాడు. 
ఇప్పటి వరకు ఉమేష్‌ చోరీ చేసిన ద్విచక్ర వాహనాలన్నీ గేర్లు లేనివే. వాటిపైనే తిరుగుతూ దీపక్‌తో కలిసి అనేక స్నాచింగ్స్‌ చేశాడు. ఈ ఇద్దరిపై గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో పదుల
సంఖ్యలో కేసులు ఉన్నాయి.  
ఉమేష్‌ 2015లో కొన్నాళ్లు అహ్మదాబాద్‌ సమీపంలోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్నాడు. అప్పట్లో చోరీ కేసులకు సంబంధించి సోలా పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై గుజరాత్‌ యూనివర్సిటీ ప్రాంతంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. 
దీంతో ఆ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ రాజ్యగురు ఇతడిని పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. తమ ఠాణాకు తరలించి చోరీ సొత్తు ఎక్కడ విక్రయించావో చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆయనపై కక్షగట్టిన ఉమేష్‌ కోర్టులో హాజరుపరిచిన తర్వాత పెద్ద డ్రామా నడిపాడు. అప్పట్లో ఉమేష్‌ వయసు కేవలం 19 ఏళ్లు.  
సదరు ఇన్‌స్పెక్టర్‌ ఇంటరాగేషన్‌ పేరుతో విచక్షణారహితంగా కొట్టారని, ఈ నేపథ్యంలోనే తన రెండు కళ్లూ పోయాయంటూ ఆరోపించాడు. దీంతో న్యాయస్థానం అతడికి ప్రత్యేక చికిత్స అందించేలా ఆదేశాలిచ్చింది.  
రాజ్యగురుపై విచారణను చేపట్టింది. చివరకు ఠాణాలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను ఉన్నతాధికారులు పరిశీలించిన నేపథ్యంలో అతడి ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఈలోపే అతడి తండ్రి గులాజ్‌జీ, తల్లి మోహిని, సోదరి ఉష సైతం విలేకరుల సమావేశాలు పెట్టి హడావుడి చేశారు. పోలీసులను బ్లాక్‌మెయిల్‌ చేయడానికే ఈ వ్యవహారం నడిపినట్లు తేలింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top