నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజీలు

CCTVs Help Cops Crack Hit And Run Case In Vizianagaram District - Sakshi

సాంకేతిక నైపుణ్యతతో హిట్‌ అండ్‌ రన్‌ కేసును చేధించిన పోలీసులు

విజయనగరం క్రైమ్‌/పూసపాటిరేగ: పూసపాటిరేగ మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై మే 31న జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ రహదారి ప్రమాద నిందితుడు పట్టుబడ్డాడు. సాంకేతిక సాక్ష్యాధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణం గాజులకొల్లివలసకు చెందిన భార్యాభర్తలు రౌతు రోహిణి, యోగేశ్వరరావులు విశాఖపట్నానికి మోటారు సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడం, ఘటనా స్థలంలోనే మృతిచెందిన విష యం తెలిసిందే.

దీనిపై కేసు నమోదు చేసిన పూసపాటిరేగ ఎస్‌ఐ ఆర్‌.జయంతి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో దొరికిన సాంకేతిక సాక్ష్యాలు, ఎక్సేంజ్‌ ఆఫ్‌ మెటిరియల్‌లో బైక్‌కు అంటిన వైట్‌ పెయింట్, ఫాగ్‌ లైట్‌ కవర్‌లు ఆధారంగా ఢీకొట్టిన వాహనం తెలుపు రంగు ఎర్టిగా కారుగా గుర్తించారు. ప్రమాద స్థలానికి దగ్గరగా జాతీయ రహదారిపై ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాద సమయంలో నాలుగు ఎర్టిగా కార్లు వెళ్లడం గమనించారు. అరబిందో ఫార్మాకు, ప్రమాద స్థలానికి నాలుగు కిలోమీటర్లు దూరం.

ఈ లెక్కన బైక్‌ను వేగంగా క్రాస్‌ చేసి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. టోల్‌ గేట్‌ సిబ్బంది సహకారంతో కారు నంబర్‌ (ఏపీ 39బీవీ9909)ను సేకరించారు.  ఈ చలానా యాప్‌ ద్వారా కారు నంబర్‌ అడ్రస్‌ విశాఖ పట్నానికి చెందిన నాయని శంకర రెడ్డిదిగా గుర్తించారు.  వెంటనే ఎస్‌ఐ, సిబ్బంది విశాఖపట్నం వెళ్లారు. సీసీ ఫుటేజీలో కారు డ్రైవర్‌ వేసుకున్న మాస్క్‌ డిజైన్‌తో అక్కడ ఉన్న కారు డ్రైవర్‌ వేసుకున్న మాస్క్‌ డిజైన్‌ మ్యాచ్‌ కావడంతో విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. కారును సీజ్‌చేసి పూసపాటిరేగ స్టేష న్‌కు తరలించారు. కేసు ఛేదించిన ఎస్‌ఐ, సిబ్బందితో పాటు, వారికి మోనటరింగ్‌ చేసిన భోగాపురం సీఐ శ్రీధర్‌ను డీఎస్పీ అభినందించారు.

చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్‌ కాల్‌ కాపాడింది 
కులాంతర వివాహం చేసుకున్నాడని.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top