Shri Lakshmi Cotsyn: మరో భారీ ‘రుణ’ కుంభకోణం

CBI raids on six thousand crore defaulter Shri Lakshmi Cotsin - Sakshi

రూ.6,833 కోట్లకు పైగా బురిడీ

10 బ్యాంకుల కన్సార్టియంకు భారీ నష్టం

కాన్పూర్‌లో శ్రీలక్ష్మి కాట్‌సిన్‌ సంస్థ, చైర్మన్‌పై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్న బాగోతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబుల బండారం బట్టబయలవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శ్రీలక్ష్మి కాట్‌సిన్‌తోపాటు ఆ సంస్థ చైర్మన్‌ కమ్‌ ఎండీ మాతా ప్రసాద్‌ అగర్వాల్, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీరు భారీగా రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు.

ఫలితంగా బ్యాంకుల కన్సార్టియంకు రూ.6,833 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈ ఏడాది సీబీఐ దర్యాప్తు చేస్తున్న బ్యాంకు ఫ్రాడ్‌ కేసుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు తాజాగా నోయిడా, రూర్కీ, కాన్పూర్, ఫతేపూర్‌ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సెంట్రల్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా ఫిర్యాదు మేరకు బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో సీబీఐ అధికారులు ‘శ్రీలక్ష్మి కాట్‌సిన్‌’ చైర్మన్‌ మాతా ప్రసాద్‌ అగర్వాల్‌తోపాటు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌కుమార్‌ అగర్వాల్, డైరెక్టర్‌ శారదా అగర్వాల్, డిప్యూటీ ఎండీ దేవస్‌ నారాయణ్‌ గుప్తాను నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

నిందితులు ఉద్దేశపూర్వకంగానే తమ బ్యాంకును మోసగించినట్లు సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆరోపించింది. తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారని, ఇలా చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని తేల్చిచెప్పింది. రుణం కోసం తప్పుడు పత్రాలు సమర్పించారని, అబద్ధాలు చెప్పారని పేర్కొంది. వస్త్ర వ్యాపారం చేసే శ్రీలక్ష్మి కాట్‌సిన్‌ సంస్థ తమ వద్ద అధికంగా నిల్వలు ఉన్నట్లు బ్యాంకులకు ఫోర్జరీ రికార్డులు సమర్పించింది. రూ.7,926 కోట్లకు పైగా రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా బ్యాంకులను దగా చేసిన హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌(ఇండియా) లిమిటెడ్‌పై గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top