నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో ఇద్దరు బెంగాల్‌ మంత్రుల అరెస్ట్‌

CBI arrests Bengal ministers Firhad Hakim, Subrata Mukherjee and 2 others - Sakshi

మరో ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి సైతం సీబీఐ అదుపులోకి

సీబీఐ ఆఫీస్‌ వద్ద 6 గంటలపాటు నిరసన తెలిపిన సీఎం మమత

బెయిల్‌ మంజూరు చేసిన సీబీఐ కోర్టు .. ఆపై హైకోర్టు స్టే

కోల్‌కతా: నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో పశ్చిమ బెంగాల్‌లో అరెస్టుల పర్వం సోమవారం మొదలైంది. ఈ కేసులో టీఎంసీ నేతృత్వంలోని బెంగాల్‌ సర్కార్‌లో మంత్రులుగా ఉన్న ఫిర్హాద్‌ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. మరో టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, రాష్ట్ర మాజీ మంత్రి సోవన్‌ ఛటర్జీలనూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది.   రోజంతా హైడ్రామా నడిచింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అరెస్టుల విషయం తెల్సి మమత వెంటనే సీబీఐ ఆఫీస్‌కు వచ్చి దాదాపు ఆరుగంటలపాటు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు, ఈ నలుగురికీ బెయిల్‌ మంజూరుచేస్తూ స్పెషల్‌ సీబీఐ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం సోమవారం రాత్రి హైకోర్టు వీరి బెయిల్‌పై స్టే ఇచ్చింది. అరెస్టులను నిరసిస్తూ టీఎంసీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ఆంక్షలను గాలికొదిలేసి నిరసన చేపట్టారు.  

అరెస్టులు చట్టవిరుద్ధం: స్పీకర్‌
‘ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలంటే ప్రొటోకాల్‌ ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌గా నాకు ముందే సమాచారమివ్వాలి. అలాంటి లేఖలు ఏవీ నాకు సీబీఐ నుంచి రాలేదు. ఇలా స్పీకర్‌ అనుమతి లేకుండా ఎమ్మెల్యేల అరెస్ట్‌ చట్టవిరుద్ధం’ అని బెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నలుగురు నేతల అరెస్టుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ గతంలో అనుమతులు ఇవ్వడం గమనార్హం.

నన్నూ అరెస్ట్‌ చేయండి: మమతా బెనర్జీ
అరెస్టుల విషయం తెల్సుకున్న టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ వెంటనే కోల్‌కతాలో సీబీఐ కార్యాలయం ఉన్న ‘నిజాం ప్యాలెస్‌’ భవంతికి వచ్చి ధర్నా చేపట్టారు. అరెస్టులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘సీబీఐ ఆఫీస్‌ నుంచి వెళ్లేదేలేదు. కావాలంటే నన్నూ అరెస్టు చేయండి’ అని అక్కడ ఉన్న సీబీఐ సిబ్బందితో మమత ఆగ్రహంగా అన్నారు. అరెస్టు చేశాక ఆ నలుగురు నేతలను సీబీఐ అధికారులు బిల్డింగ్‌లోని 15వ అంతస్తులోని ఒక రూమ్‌కు తీసుకెళ్లారు. మమత ఆ రూమ్‌ బయటే నిరసన తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు ఆమె సీబీఐ కార్యాలయంలోనే ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకొని వేధింపులకు దిగుతోందని తృణమూల్‌ ఆరోపించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top