మోసగాడు సిద్ధార్థ్‌పై కేసు నమోదు

Case registered against fraudster Dial Institute owner Siddharth - Sakshi

నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలో.. 

విజయవాడ స్పోర్ట్స్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన డయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ యజమాని సిద్ధార్థ్‌పై ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో గురువారం కేసు నమోదయింది. విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అందులో యువతులను నియమించి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేసి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

నిందితుడు సిద్ధార్థ్‌పై 409 (బ్యాంక్‌ చెక్కులను మోసానికి వినియోగించడం, అగ్రిమెంట్‌లను ఆర్థిక మోసాలకు వినియోగించడం), 406 (ఉద్దేశపూర్వకంగా నేరపూరిత కుట్రకు పాల్పడటం), 406 (నమ్మించి మోసం చేయడం) సెక్షన్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ వి.జానకిరామయ్య తెలిపా­రు. ఈ మోసంపై 14వ తేదీ అర్ధరాత్రి వరకు 25 మంది బాధితులు తమను ఆశ్రయించారని, గురువారం మరో పది మంది ఆశ్రయించినట్లు చెప్పారు. 

పకడ్బందీగా మోసం
నిందితుడు సిద్ధార్థ్‌ పక్కా ప్రణాళికతో అత్యంత పకడ్బందీగా మోసానికి పాల్పడినట్లు  తెలుస్తున్నది. నిరుద్యోగులను ఆకర్షించేందుకు అతను ఏర్పాటు చేసిన డయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యువతులను మాత్రమే నియమించడం, వారిని గరిష్టంగా రెండు నెలల్లో ఉద్యోగం నుంచి తొలగించేవాడు. నిరుద్యోగులు అతని బ్యాంక్‌ అకౌంట్‌కు చెల్లించిన నగదును వెంటనే విత్‌డ్రా చేసి బ్యాంక్‌ ఖాతాలను నిత్యం ఖాళీగానే ఉంచే వాడు.

అతని రేషన్‌కార్డ్, ఇంటి అడ్రస్, ఆధార్‌ వివరాలు ఆన్‌లైన్‌లో లేకుండా  ముందస్తుగానే వ్యూహ రచన చేసుకున్నాడు. అయితే డయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న మోసంపై ఆరు నెలల క్రితమే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పోలీసులు సెటిల్‌మెంట్‌ చేసి కేసు నమోదు చేయకుండా మిన్నకుండిపోవడంతో ఇటీవల కాలంలో నిందితుడు సిద్ధార్థ్‌ వలలో మరికొంత మంది బాధితులు బలి అయ్యారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top