
న్యూయార్క్: అమెరికాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మాన్హాటన్ ముర్రే హిల్ ప్రాంతంలో శుక్రవారం నిరసన చేపట్టిన నిరసనకారుల పైకి అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 12 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌తో పాటు, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే శుక్రవారం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు, వలసదారుల నిర్బంధించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తును నిరసనకారులు నిరసన చేపట్టారు.
నిరసనకారులపై ఒక్కసారిగా దూసుకుపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాహనదారుడు ఉద్దేశపూర్వకంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డడా? లేదా ట్రాఫిక్ కారణంగా ఇలా జరిగిందా? అనే అంశంలో విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో నిరసనలో సుమారు 40 నుంచి 50 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.