పైన బంగాళాదుంపలు.. అడుగున గంజాయి ప్యాకెట్లు 

Cannabis bags under potato bags at Paderu - Sakshi

అగనంపూడి (గాజువాక)/యలమంచిలి రూరల్‌/పాయకరావుపేట: గంజాయి  అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తరలిస్తున్న 790 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అరెస్టు చేశారు. దువ్వాడ సీఐ టి.లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాదుంపల లోడు వ్యాన్‌లో అడుగున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు దువ్వాడ పోలీసులకు సమాచారం అందడంతో గురువారం వేకువజామున  దువ్వాడ పోలీసులు దాడి చేశారు. అగనంపూడి టోల్‌గేటు వద్ద కాపుకాసి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

పాడేరు నుంచి వీఎస్‌ఈజెడ్‌కు సమీపంలోని డాక్‌యార్డ్‌ కాలనీలోని స్టాక్‌ యార్డ్‌కు వీటిని తరలించి తరువాత, అక్కడి నుంచి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో తమిళనాడుకు చేరవేయడానికి నిందితులు ప్లాన్‌ వేశారు. గురువారంఇదే రీతిలో సరుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మాటువేసి సరుకుతోపాటు తమిళనాడుకు చెందిన భాస్కర్‌ చంద్రశేఖర్, జాన్‌సన్‌ శంకర్‌తోపాటు డాక్‌యార్డ్‌ కాలనీకి చెందిన దుక్కా నరేష్‌లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ చెప్పారు.

ఈ దాడిలో ఎస్‌ఐ రామదాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆటోలో గంజాయి తరలిస్తుండగా విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద అడ్డుకున్నట్టు యలమంచిలి ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పాంగి మహేష్‌ అనే నిందితుడిని అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఇదిలావుండగా.. కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పాయకరావుపేట సమీపంలో పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు. 

గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పాడేరు ఏఎస్పీ జగదీష్‌.. చింతపల్లి ఏఎస్పీ తుషార్‌డుడి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించాలని సుమారు 600 మంది విద్యార్థులతో అవగాహన కల్పించారు. పాడేరులో తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులను సమావేశపర్చి గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల గిరిజనులకు జరుగుతున్న నష్టంపై ఏఎస్పీ అవగాహన కల్పించి .. తల్లిదండ్రులను చైతన్యపర్చాలని సూచించారు. అనంతరం ‘గంజాయి సాగు వద్దు–వ్యవసాయమే ముద్దు’ అంటూ ప్రదర్శన చేశారు.  
ప్లకార్డులతో గిరిజన విద్యార్థులు, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఇతర అధికారులు   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top