రూ. 500 కోట్లతో పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ
గిరిజనులకు చేరువైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
వెనుకబడిన గిరిజన ప్రాంతంలో గిరిజనులకు కార్పొరేట్ స్థాయి ఉన్నత వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాడేరులో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ఎందరో విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసింది. రూ.500 కోట్లతో ఈ కళాశాల నిర్మాణం చేపట్టారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని జిల్లా సర్వజన ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని సౌకర్యాలను కల్పించారు.
వైద్య కళాశాల ప్రిన్సిపల్ పోస్టును భర్తీ చేయడంతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య సిబ్బంది, టెక్నికల్ సిబ్బందిని నియమించి జిల్లా సర్వజన ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఎన్నికల అనంతరం జాతీయ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు కళాశాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా 50 సీట్లతో గత ఏడాది వైద్య కళాశాల ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా 50 మంది వైద్య విద్యార్థులతో రెండవ బ్యాచ్ క్లాసులు జరుగుతున్నాయి.
ప్రభుత్వ నిర్వాకం వల్ల మరో 50 సీట్లు ఈ ఏడాది రాకుండా పోయాయి. ప్రస్తుతం మొదటి, రెండవ ఏడాది విద్యార్థులు 100 మందితో పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల కళకళలాడుతోంది. ఈ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయబట్టే.. ఎంబీబీఎస్ సీట్లు పెరిగి తన లాంటి వారెందరికో సీట్లు వచ్చాయని ఎంతో మంది విదార్థులు కొనియాడుతున్నారు. తమకు మంచి వైద్యం అందుతోందని అటు గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)
జగనన్న చొరవతో నాకు సీటొచ్చింది
మా నాన్న చాన్నాళ్ల క్రితం చనిపోయారు. అమ్మ కష్టపడి నన్ను చదివిస్తోంది. నాకొచ్చిన ర్యాంకుకు మా ఊళ్లో సీటు రాదు. కొత్తగా జగనన్న మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరిగి, నాకు గత ఏడాది ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తద్వారా నా లాంటి పేద విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం దక్కింది.
పాడేరులో మంచి వాతావరణంలో వైద్య కళాశాలను నిర్మించారు. చాలా బాగుంది. ఇక్కడ అధునాతన సదుపాయాలు కల్పించారు. ఇందుకు కృషి చేసిన వైఎస్ జగన్ అన్నకు కృతజ్ఞతలు. ఎందరో పేదలకు వైద్య విద్యను అందించిన ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. – చల్ల అభినయ, పేరేచర్ల, గుంటూరు జిల్లా


