రూ.14 లక్షల సుపారీ.. బావమరిది హత్యకు బావ కుట్ర.. మరో ఇద్దరినీ..

Brother In Law Supari To Kill Three korutla Jagtial Karimnagar - Sakshi

ఛేదించిన కోరుట్ల పోలీసులు

ఐదుగురు సభ్యుల గ్యాంగ్‌ అరెస్టు

2 కార్లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం

కోరుట్ల: ఆర్థిక లావాదేవీలు.. వృత్తిపరమైన పోటీని తట్టుకోలేక ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి సహా నలుగురు సుపారీ గ్యాంగ్‌ సభ్యులను అరెస్టు చేసి 2 కార్లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. బుధవారం కోరుట్ల సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.

సీఐ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన ధనకంటి సంపత్‌(35) ఆర్‌ఎంపీగా పనిచేసూ్తనే చిట్టీలు, ఫర్నీచర్‌ షాపు నిర్వహించేవాడు. సంపత్‌ సొంత బావమరిది, రాయికల్‌కు చెందిన సంకోజి విష్ణువర్ధన్‌(32) తన బావమరిది అజయ్‌(28)తో కలిసి చిట్టీలు, ఫర్నీచర్‌ షాపు నడపడంలో సంపత్‌కు ఆర్థికంగా సాయం చేశాడు. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు సజావుగా సాగింది.

ఆర్థిక లావాదేవీల్లో గొడవలు..
ఫర్నీచర్‌ షాపు, చిట్టీల వ్యవహరంలో సంపత్‌కు అతడి బావమరిది విష్ణువర్ధన్, అజయ్‌కు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వీటితోపాటు తన కుటుంబంలో విష్ణువర్ధన్‌ తరచూ జోక్యం చేసుకోవడం సంపత్‌కు కంటగింపుగా మారిది. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌తోపాటు అజయ్‌ను అడ్డుతొలగిస్తే అత్తగారి ఆస్తి మొత్తం తనకు కలిసివస్తుందన్న దురాశ సంపత్‌లో కలిగింది. రెండేళ్ల క్రితం విష్ణువర్ధన్‌ అనారోగ్యానికి గురికాగా, సంపత్‌ వైద్యం అందించి కావాలని ఓవర్‌డోస్‌ ఇంజక్షన్లు ఇచ్చి హత్యకు యత్నించాడు.

ఆ తర్వాత విష్ణువర్ధన్‌ కోలుకోగా తన ప్రయత్నం ఫలించలేదని భావించిన సంపత్‌.. నాలుగు నెలల క్రితం ఓ హత్యాయత్నం కేసులో నిందితుడైన పైడిమడుగు గ్రామానికి చెందిన క్యాతం శేఖర్‌(26)ను కలిసి విష్ణువర్ధన్, అజయ్‌తోపాటు వృత్తిలో పోటీగా ఉన్న పైడిమడుగు ఆర్‌ఎంపీ రాజేందర్‌ను హత్య చేయడానికి తనకు సహకరించాలని కోరాడు.

రూ.14లక్షల సుపారీకి ఒప్పందం..
క్యాతం శేఖర్‌ పైడిమడుగుకు చెందిన మేదిని శ్రీకాంత్‌(28), కోరుట్లకు చెందిన విత్తనాల నాగరాజు(40), ఆకుల అశోక్‌తో కలిసి విష్ణువర్ధన్, అజయ్, రాజేందర్‌ను చంపడానికి రూ.14 లక్షల సుపారీకి సంపత్‌తో ఒప్పందం చేసుకున్నాడు. తొలుత రాజేందర్‌ను చంపితే రూ.4లక్షలు, తర్వాత విష్ణువర్ధన్, అజయ్‌ను చంపితే మిగిలిన రూ.10 లక్షలు ఇస్తానని సంపత్‌తో ఒప్పందం చేసుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్‌ ఇవ్వడానికి ఒప్పందం కుదిరిన తర్వాత డబ్బులు చెల్లించడంలో సంపత్‌ జాప్యం చేశాడు.

డిసెంబర్‌ 5వ తేదీన సంపత్‌తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్న ఆకుల అశోక్, మేదిని శ్రీకాంత్‌.. హత్య కుట్రలో ఒకరైన పైడిమడుగు ఆర్‌ఎంపీ రాజేందర్‌ ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి బయటకు పిలిచారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. దీంతో ఇరుగుపొరు రావడంతో అశోక్, శ్రీకాంత్‌ అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆర్‌ఎంపీ రాజేందర్, సంకోజి విష్ణువర్ధన్‌ ఫిర్యాదు మేరకు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఎస్సైలు చిర్ర సతీశ్, శ్యాంరాజ్, సుధీర్‌రావు, రాంచంద్రం.. సుపారీ ఒప్పందం చేసుకుని హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, మేదిని శ్రీకాంత్, ఆకుల అశోక్, విత్తనాల నాగరాజు, క్యాతం శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ, కోరుట్ల సర్కిల్‌ పరిధిలో పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సొంత బావమరిదితోపాటు మరో ఇద్దరి హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, సుపారీ గ్యాంగ్‌ సభ్యుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్‌పోన్లు స్వా«ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించి, ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీసులకు రివార్డు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐ వివరించారు.
చదవండి: భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్‌.. చివరకు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top