ప్రేమను చంపుకోలేక.. ప్రాణం తీసుకుంది

Bride Srujana Death Mystery Unleashed - Sakshi

నవ వధువు మృతిపై వీడిన మిస్టరీ 

సాంకేతికత సాయంతో తేల్చిన పోలీసులు  

పీఎం పాలెం (భీమిలి): నవ వధువు సాయి సృజన మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రేమ కోసం పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మధురవాడలో ఈ నెల 11న నవ వధువు సాయి సృజన పెళ్లి పీటలపై కుప్పకూలిపోవడం.. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని విష పదార్థం తీసుకోవడం వల్లే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించడంతో అనుమానాస్పద మృతిగా పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో కుటుంబ సభ్యుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటం, ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో గన్నేరు పప్పు తొక్కు కనిపించడం.. మరోవైపు ఆమె ఫోన్‌లోని కొంత సమాచారం డిలీట్‌ చేసి ఉండటంతో సాంకేతికత సాయంతో దర్యాప్తు చేశారు. డిలీట్‌ చేసిన సమాచారాన్ని కాల్‌ డయల్‌ రికార్డర్‌ (సీడీఆర్‌) సాయంతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రేమించిన యువకుడితో కాకుండా వేరే వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లికి నిర్ణయించడంతో ఆ వివాహాన్ని ఆపాలని ఆమె ప్రయత్నించిందని.. ఈ క్రమంలో తీసుకున్న విషపదార్థం మోతాదు మించడంతో ఆరోగ్యం విషమించి చనిపోయిందని పోలీసులు నిర్థారించారు.  

ఇంటర్‌లో చిగురించిన ప్రేమను చంపుకోలేక.. 
బంధువుల ఇంట్లో ఉంటూ పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలోని విజ్ఞాన్‌ కాలేజీలో 2015లో ఇంటర్‌ చదివే సమయంలో సాయి సృజనకు అదే కళాశాలలో చదువుతున్న తోకాడ మోహన్‌(24)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇంటర్‌ పూర్తయ్యాక సృజన హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అయినప్పటికీ వీరి మధ్య గత ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో 2021లో మోహన్‌ హైదరాబాద్‌ వెళ్లడంతో మరింత దగ్గరై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, సరైన ఉద్యోగం వచ్చే వరకు నిరీక్షించాలని మోహన్‌ కోరాడు.

ఈ క్రమంలో సృజనకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి ఈ నెల 11న ముహూర్తం ఖరారు చేశారు. విశాఖ నగర శివారు మధురవాడలో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడు మోహన్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో సృజన చాటింగ్‌ చేస్తూ... తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ఎలాగైనా తీసుకెళ్లిపోమని కోరింది. ఉద్యోగం లేకుండా తీసుకెళ్లలేనని, కొన్నాళ్లు నిరీక్షించాలని మోహన్‌ బదులిచ్చాడు. అందుకోసం పెళ్లి ఎలాగైనా ఆపుతానని సృజన చెప్పడంతో.. ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దని మోహన్‌ కోరాడు. దీనికి తన జాగ్రత్తలో తానున్నానని, ఎలాగైనా పెళ్లి ఆపుతానని ఆమె బదులిచ్చింది.

అనంతరం ఈ వ్యవహారంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఫోనులోని వివరాలు డిలీట్‌ చేసేసింది. తర్వాత పెళ్లి ఆపాలన్న ఉద్దేశంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపేయడంతో.. మరుసటి రోజున గుర్తు తెలియని విష పదార్థం తినడంతో పెళ్లి పీటలపై కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇలా పెళ్లి ఆపడానికి ఆడిన నాటకం చివరకు ఆమె ప్రాణాలనే బలిగొంది. అందరూ అనుమానాస్పద మరణమే అనుకున్నప్పటికీ సీడీఆర్‌ నివేదిక ద్వారా పోలీసులు వివరాలు సేకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top