మానుకోటలో బాలుడి కిడ్నాప్‌

Boy Kidnapped In Mahabubabad - Sakshi

రూ.45 లక్షలు ఇస్తే విడిచి పెడతామని కిడ్నాపర్ల డిమాండ్‌

ఇంకా తెలియరాని బాలుడి ఆచూకీ

కిడ్నాపర్ల నుంచి మళ్లీ రాని ఫోన్‌.. తల్లిదండ్రుల ఆందోళన

సాక్షి, మహబూబాబాద్‌: అప్పటివరకు తండ్రితో కలిసి దసరా షాపింగ్‌ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్‌ కావడం కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌కు చెందిన ఓ చానెల్‌ వీడియో జర్నలిస్టు కుమారుడు దీక్షిత్‌ (9) ఆది వారం స్నేహితులతో ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎక్కించుకుని తీసుకెళ్లారు. సోమవారం రాత్రి వరకు బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దీక్షిత్‌ తన తండ్రితో కలిసి షాపింగ్‌ చేసి ఆది వారం సాయంత్రం 5.30కి ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటి పక్కనున్న స్నేహితులు భువన చంద్ర, హర్షతో కలిసి 

ఆడుకుంటుండగా, బైక్‌పై వచ్చిన వ్యక్తి పిలవడంతో దీక్షిత్‌ నవ్వుకుంటూ వెళ్లి అతడి బైక్‌ ఎక్కి స్నేహితులకు బై చెబుతూ వెళ్లాడు. ఆదివారం రాత్రి 9.40 నిమిషాలకు కిడ్నాపర్లు ఫోన్‌చేసి ‘మీ బాబు సేఫ్‌గా ఉండాలంటే రూ.45 లక్షలివ్వాలి.. రేపు ఉదయం ఫోన్‌చేసి ఎక్కడికి రావాలో చెబుతాం’ అన్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బాలుడి నివాస పరిసరాలను పరిశీలించారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 50 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్‌ ఆధారంగా వివిధ నంబర్ల నుంచి ఫోన్‌ చేస్తుండటంతో ట్రేస్‌ చేయడం కష్టంగా మారిందని సమాచారం. బాలుడిని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు కాలనీలోని సీసీ టీవీల్లో నిక్షిప్తం కాగా, వాటి ఆధారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు.  

4 గంటలకు ఫోన్‌ రాలేదు
ఇప్పటివరకు బాలుడి తల్లికి కిడ్నాపర్లు ఆరుసార్లు ఫోన్‌ చేశారు. ఫోన్‌ సంభాషణల్లో పలు సందర్భాల్లో ‘బాబు మా దగ్గర సేఫ్‌గా ఉన్నాడు. జ్వరం వస్తే టాబ్లెట్లు వేశాం.. డబ్బిస్తే విడిచిపెడతాం.. మీరు టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాకన్నీ తెలుసు’ అని కిడ్నాపర్లు అన్నారు. సోమవారం సాయంత్రం మళ్లీ ఫోన్‌ చేసేసరికి డబ్బు సిద్ధంగా ఉంచాలని కిడ్నాపర్లు చెప్పారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఫోన్‌ రాకపోవడంతో ఆందోళన వ్యక్తమ వుతోంది. బాలుడి తల్లి వసంత మాట్లాడుతూ  డబ్బిస్తాం, తమ కుమారుడికి ఎటువంటి హాని తలపెట్టకుండా విడుదల చేయాలని కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top