బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు దుర్మరణం

హస్తినాపురం: బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు ఘన్‌పూర్ మండలం, బస్వరాజ్‌పల్లి గ్రామానికి చెందిన పి.నవీన్(22) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ వనస్థలిపురంలోని పద్మావతినగర్‌లో నివాసం ఉంటున్నాడు.
అదే జిల్లాకు చెందిన అతడి స్నేహితుడు అడ్డూర్ పవన్‌కల్యాన్(22), కరీంనగర్‌కు చెందిన జె.శివ(23)ఉద్యోగం కోసం మూడు రోజుల క్రితం నవీన్ వద్దకు వచ్చారు. గురువారం రాత్రి హయత్‌నగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడు నిమ్మల సాయి కుమార్ సాయికుమార్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ముగ్గురు కలిసి హయత్‌నగర్ వెళ్లారు.
పార్టీ అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా పద్మావతినగర్ కాలనీ మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్, పవన్ కల్యాన్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: పరారీలో యూట్యూబర్ కటారియా.. ఆచూకీ చెబితే రూ.25వేల రివార్డ్)