Twist In Bowenpally Kidnap Case: Bhuma Akhil Priya As A1 Accused | ఏ-1గా భూమా అఖిలప్రియ - Sakshi
Sakshi News home page

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు: ఏ-1గా భూమా అఖిలప్రియ

Published Thu, Jan 7 2021 2:18 PM

Bhuma Akhila Priya A1 In Bowenpally Kidnapping Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్‌పేట్‌ భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు.. ఈ కేసులో ఏ-1గా భూమా అఖిలప్రియను పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మార్పులు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్‌రామ్‌, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్‌ పేర్లను పోలీసులు నమోదు చేశారు. (చదవండి: బోయిన్‌పల్లి కిడ్నాప్‌: వెలుగులోకి సంచలన విషయాలు)

కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్ల పోలీసులకు బాధితులు తెలిపారు. హఫీజ్‌పేట సర్వే నం.80లో 2016లో 25 ఎకరాలను బాధితులు కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. భూమి తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్‌రామ్‌ వాదిస్తున్నారని, ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్‌ చేసుకున్నారు.. భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారని, ఇంకా డబ్బులు కావాలని నిందితులు డిమాండ్‌ చేశారని పోలీసులు పేర్కొన్నారు. భూమా అఖిలప్రియపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద కేసులను పోలీసులు నమోదు చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు సికింద్రాబాద్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

టీడీపీ నేత అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందగా, ల్యాండ్ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2016లో ప్రవీణ్‌కుమార్‌ సర్వే నంబర్‌ 80లో 25 ఎకరాల భూమి కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్‌రామ్ లిటిగేషన్ పెట్టారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి  ప్రవీణ్‌.. డబ్బు చెల్లించారు. సెటిల్‌మెంట్ విషయం తెలిసి అఖిలప్రియ మండిపడ్డారు

 ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు దగ్గర ఎలాగైన డబ్బు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు ప్లాన్‌ వేశారు. సాయి అనే వ్యక్తితో కలిసి అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ తర్వాత ఓఆర్‌ఆర్‌ వద్ద ఖాళీ బాండ్‌ పేపర్‌పై కిడ్నాపర్లు సంతకాలు చేయించారు. సంతకాల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ పేర్లను కిడ్నాపర్లు ప్రస్తావించారు. సంతకాలు తీసుకునే సమయంలోకిడ్నాపర్లు  కర్రలతో దాడి చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియను ముందే అదుపులోకి తీసుకోకుంటే.. సాక్ష్యాధారాలు తారుమారు చేసేవారని  పోలీసులు భావించారు. అఖిలప్రియ, భర్త భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement