Banjara Hills SI Suicide: బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

Banjara Hills Traffic SI Commits Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వడ్డెపు రమణ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలాలి–చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం ఉన్నట్టు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు గురువారం ఉదయం 7.55 గంటలకు సమాచారం అందింది. మౌలాలి రైల్వేస్టేషన్‌ సమీపంలోని సీ క్యాబిన్‌ వద్ద రెండు ముక్కలైన యువకుడి మృతదేహం ఉన్నట్టు రైల్వే ‘కీ’ మెన్‌ వెంకటేశ్వర్‌రావు ద్వారా సమాచారం అందింది.  సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీను కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన వడ్డెపు అప్పల స్వామి రెండోకుమారుడు రమణ 2020 బ్యాచ్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.

చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ముగ్గురు మిత్రులతో కలిసి ఉంటూ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల తరువాత బయటకు వెళ్లి వస్తానని రూమ్‌మేట్స్‌కు చెప్పి వెళ్లాడు. అదే రోజు అర్థరాత్రి దాటిన తరువాత మౌలాలి ప్రాంతానికి చేరుకుని రైలు పట్టాలపై తలపెట్టి  ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.  కొద్ది రోజులుగా రమణ మానసిక ఆందోళనలకు గురవుతున్నట్టు, ఇందుకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

నగరంలోనే నివాసం ఉంటున్న అక్క,బావతోపాటు, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహరాజు సికింద్రాబాద్‌ చేరుకుని రమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్క,బావతోపాటు పలువురు రమణ బ్యాచ్‌ ఎస్‌ఐలు గాంధీ ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ తల్లితండ్రులు శుక్రవారం ఉదయానికి నగరానికి చేరుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని, విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top