12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా

An Assistant Who Cheated An Old Man Steals Rs 40 lakh - Sakshi

బంజారాహిల్స్‌: తన తండ్రికి సహాయంగా ఉండేందుకు నియమించిన అటెండర్‌ నమ్మక ద్రోహానికి పాల్పడి తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ రూ. 40 లక్షల మేర నగదు డ్రా చేసి మోసగించాడంటూ ఓ ఎన్‌ఆర్‌ఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో ఆర్‌ఆర్‌ఎస్‌ అర్ని(94) నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు విద్యుత్‌ అర్ని కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుండగా కూతురు హాంకాంగ్‌లో ఉంటున్నది.

2019లో తల్లి చనిపోవడంతో తన తండ్రికి సహాయంగా ఉండేందుకు జనగామ సమీపంలోని చేల్పూర్‌ గ్రామానికి చెందిన ఉదయ్‌ కిరణ్‌ను నెలకు రూ.30 వేల జీతంతో 2017లో అటెండర్‌గా నియమించారు. ఆ ఇంట్లో ఉదయ్‌కిరణ్‌తో పాటు గార్డెనర్, డ్రైవర్, కుక్, పనిమనిషితో సహా నలుగు రు పని చేస్తుంటారు. తన తండ్రికి సేవలు సరిగ్గా లభిస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు విద్యుత్‌ అర్ని, కూతురు కలిసి ఇంట్లో 12 కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే పర్యవేక్షించేవారు. తన తండ్రికి సమయానికి ఆహారం, మాత్రలు ఇస్తున్నారో లేదో కెమెరాల ద్వారానే తెలుసుకునేవారు.

తన తండ్రి ఫోన్, కంప్యూటర్, ఐప్యా డ్‌ తదితర పనులను కూడా ఉదయ్‌కుమార్‌ చేసేవారు. ఇదే అదనుగా బ్యాంకు లావాదేవీలు చూసే క్రమంలో ప్రతి నెల ఇంటి ఖర్చులు డ్రా చేసే నిమిత్తం మూడేళ్లలో రూ.40 లక్షల వరకు దొడ్డిదారిలో డ్రా చేసి తన జేబులో వేసుకున్నట్లుగా తేలిందన్నా రు. తాను ఇటీవల హైదరాబాద్‌కు వచ్చానని ఇంటి లెక్కలు ఆడిట్‌ చేయగా రూ.40 లక్షలు అక్రమాలు తేలాయని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉదయ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

(చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top