‘మేకింగ్‌ మనీ యాప్‌’ పేరిట మోసం | Sakshi
Sakshi News home page

‘మేకింగ్‌ మనీ యాప్‌’ పేరిట మోసం

Published Thu, Oct 7 2021 4:22 AM

Arrest of two cyber criminals for Making Money APP - Sakshi

కడప అర్బన్‌: ఇంట్లోనే ఉంటూ సులువుగా డబ్బులు సంపాదించండి అంటూ.. ఆర్‌సీసీ మేకింగ్‌ మనీ యాప్‌ పేరిట సెల్‌ఫోన్‌లకు లింకులు పంపి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుని మోసాలకు తెగబడుతున్న ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులకు సంబంధించిన 23 బ్యాంకు ఖాతాలను గుర్తించి, అందులోని రూ.62.5 కోట్ల మొత్తాన్ని స్తంభింప (ఫ్రీజ్‌) చేశారు. కడప వన్‌టౌన్, చాపాడు, మైదుకూరు, దువ్వూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన నాలుగు కేసుల్లో దాదాపు 100 మంది బాధితులకు రూ.11 కోట్ల మేరకు నిందితులు కుచ్చుటోపీ పెట్టారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

నేరం ఇలా చేస్తారు..
► మేకింగ్‌ మనీ, ఆర్‌సీసీ, ఇతర యాప్‌ల పేరిట బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లింకులు పంపుతారు. ఈ లింకులను క్లిక్‌ చేసి.. పెట్టుబడి పెడితే కమీషన్‌ ద్వారా అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఊరిస్తారు.
► రిజిస్టర్‌ చేసుకుని, యాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ట్రేడింగ్‌ టాస్క్‌ పేరిట వస్తువును ఆన్‌లైన్‌లో కొనేందుకు టాస్క్‌ను బట్టి పెట్టుబడి పెట్టాలని చెబుతారు. టాస్క్‌లో పాల్గొని అధిక మొత్తంలో డబ్బులు కమీషన్‌ రూపంలో సంపాదించాలనే ఆశతో బాధితులు నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెడతారు.
► తొలుత కమీషన్‌ రూపంలో కొంత మొత్తాన్ని పంపిస్తారు. ఇలా డబ్బులు నిజంగా వస్తాయేమోనన్న ఆశతో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా చేస్తారు. వాట్సాప్‌ ద్వారా చాట్‌ చేస్తూ మోసాన్ని కొనసాగిస్తారు.
► టాస్క్‌ అతి సులువుగా ఉండటంతో చాలా మంది తమ సన్నిహితులతో పెట్టుబడి పెట్టిస్తారు. వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ (వీపీఏ ఐడీ) ద్వారా డబ్బును సైబర్‌ నేరగాళ్ల ఖాతాలకు డిపాజిట్‌ చేయించుకుంటారు. 
► ఆర్‌సీసీ, మనీ మేకింగ్, ఇతర యాప్‌లలో బాధితుల ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు యాప్‌లో కనిపిస్తుంటుంది. అయితే అదంతా ఫేక్‌ డిస్‌ప్లే. అప్పటికే బాధితుల మొత్తాన్ని ఇతర ఖాతాలకు తరలించి సైబర్‌ నేరగాళ్లు దానిని క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారు. 

ఇలా పట్టుబడ్డారు..
► కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన గౌస్‌బాషా ఫిర్యాదుతో నిఘా పెట్టి, తమిళనాడులోని నామక్కల్‌కు చెందిన గోకుల్‌ వెందన్‌ (28), ఈరోడ్‌కు చెందిన మురుగానందన్‌ (50)లే నిందితులుగా గుర్తించారు. వీరు ఎంతో మందిని మోసం చేశారు. అయితే ఇదే తరహా నేరం చేసిన ఘటనలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి పోలీసులు పీటీ వారెంట్‌ ద్వారా వారిని కడపకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచి, కస్టడీలోకి తీసుకున్నారు. 
► బాధితుడు గౌస్‌బాషా స్నేహితుడు దండు నాగచైతన్య కూడా రూ.99,980 మోసపోయాడు. ఇకపై ఎవరూ ఇలాంటి లింకులను క్లిక్‌ చేయొద్దు. ఎవరైనా మోసపోయి ఉంటే పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలి.   

Advertisement
 
Advertisement
 
Advertisement