డ్రైవింగ్‌ చేసేందుకు డోర్‌ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి..

Apsrtc Bus Driver Deceased In Road Accident Kadapa - Sakshi

సాక్షి,ప్రొద్దుటూరు: మరో ఐదు నిమిషాల్లో అతను డ్రైవింగ్‌ మారతాడు.. ఇందుకోసం డోర్‌ వద్ద నిల్చున్నాడు.. ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీడిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ పి రూబెన్‌ (55) అక్కడిక్కడే మృతి చెందాడు. శుక్రవారం వేకువ జామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రొద్దుటూరు డిపో నుంచి ఏపీ04 జెడ్‌ 0311 నంబర్‌ గల సూపర్‌ లగ్జరీ ఆర్టీసీ బస్సు 26 మంది ప్రయాణికులతో గురువారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరింది. పి రూబెన్‌(410219), ఎస్‌కే బాషా(411458) బస్సు డ్రైవర్లు. ప్రొద్దుటూరు నుంచి ఎస్‌కే బాషా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో ఎస్‌కే బాషా డ్రైవింగ్‌ మారాల్సి ఉంది. అంతవరకు నిద్రపోయిన రూబెన్‌ వేకువ జామున సుమారు 3.40 గంటల సమయంలో డ్రైవింగ్‌ మారేందుకు డోర్‌ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్‌పూర్‌ సమీపంలోకి వెళ్లగానే తను డ్రైవింగ్‌ చేస్తానని, బస్సు నిలపాలని రూబెన్‌ అతన్ని అడిగాడు.

కొంత దూరం వెళ్లాక దిగుతానని డ్రైవింగ్‌ చేస్తున్న ఎస్‌కే బాషా తెలిపాడు. జడ్చర్ల దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో డోర్‌ ఊడిపోవడంతో అక్కడే నిల్చున్న రూబెన్‌ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఎడమవైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా కుడివైపునకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనలో మరో డ్రైవర్‌ ఎస్‌కే బాషాతో పాటు ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఆర్టీసీడిపో మేనేజర్‌ మధుశేఖర్‌రెడ్డి, పలువురు యూనియన్‌ నాయకులు, కార్యాలయ అధికారులు హుటాహుటీనా సంఘటనా స్థలానికి వెళ్లారు.

25 ఏళ్ల నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా..  
వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన రూబెన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె కొన్ని నెలల కిందట మృతి చెందింది. కుమారుల్లో ఒకరు అలహాబాద్‌లో, మరొకరు నంద్యాలలో చదువుకుంటున్నారు. రూబెన్‌ 1996లో ఏపీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాడు. కొన్నేళ్లు రాయచోటి డిపోలో పని చేశాడు. తర్వాత ప్రొద్దుటూరు డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు.

వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన డ్రైవర్‌గా అతను పేరు తెచ్చుకున్నాడని తోటి డ్రైవర్లు చెబుతున్నారు. కేఎంపీఎల్‌ విషయంలో చాలా సార్లు అధికారుల నుంచి ప్రశంశలు పొందాడన్నారు.  ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు, యూ నియన్‌ నాయకులు రూబెన్‌కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తోటి డ్రైవర్లు కన్నీటి పర్యంతమయ్యారు.

చదవండి: శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్‌ చేసేందుకే ఇచ్చారా?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top