ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలు.. జీతం లక్ష.. కానీ తనకు బదులుగా..

Another Person Teaching In Place Of Government Teacher In East Godavari - Sakshi

చింతూరు (తూర్పుగోదావరి): ఆ అయ్యవారి జీతం అక్షరాలా లక్ష రూపాయలు పైగా ఉంది. నెల తిరిగేసరికి ఆ డబ్బులు లక్షణంగా తీసుకుంటున్నాడు. జీవితం హ్యాపీగా గడుపుతున్నాడు. కానీ తన కనీస కర్తవ్యమైన బోధనను మాత్రం విస్మరించాడు. చిన్నారులకు పాఠాలు చెప్పడానికి విముఖత చూపుతున్నాడు. మారుమూల గిరిజన గ్రామం కదా! తనను ఎవరేం చేస్తారని అనుకున్నాడేమో! అస లు పాఠశాలకే వెళ్లడం లేదు. ఇందుకు ఎటువంటి అనుమతీ కూడా తీసుకోలేదు. పైగా తనకు బదులుగా పాఠాలు చెప్పడానికి ఓ యువకుడిని తానే దర్జాగా నియమించేశాడు. రోజూ కొంత డబ్బులు కూడా చెల్లిస్తున్నాడు. ఈ అయ్యవారి బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది.

చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? 

చింతూరు మండలంలో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామం ఇరకంపేట. ఇక్కడి గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్‌)లో 52 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకరు లాంగ్‌లీవ్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. ఏడుగురాళ్లపల్లిలో నివాసం ఉంటున్న అతడు పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిచ్చడి మురళి, వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలసి శనివారం ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు గైర్హాజరవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయుడు తన బదులు అదే గ్రామానికి చెందిన యువకుడు ముచ్చిక రవికుమార్‌ను అనధికారికంగా నియమించుకున్నాడని, అతడికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తూ, విద్యార్థులకు పాఠా లు చెప్పిస్తున్నాడని తెలిపారు. రవికుమార్‌ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని చెప్పారు. ఉపాధ్యాయుడు గైర్హాజరవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఉపాధ్యాయుల వైఖరి ఇలాగే ఉంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, వైస్‌ ఎంపీపీ యడమ అర్జున్, ఎంపీటీసీ సభ్యుడు సున్నం నాగరాజు, సర్పంచ్‌లు సవలం సత్తిబాబు, పాయం చంద్రయ్య, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ యగుమంటి రామలింగారెడ్డి పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top