బిస్కెట్లా?.. విష ప్రయోగమా?

Another Boy Died Due To Eating Biscuits In kurnool Tally Reache Two - Sakshi

చింతకొమ్ముదిన్నె ఘటనలో మ‌రో  చిన్నారి మృతి 

మృత్యువుతో పోరాడుతున్న ఇంకొక చిన్నారి 

అన్ని కోణాల్లో పోలీసుల విచారణ   

ఆళ్లగడ్డ: మండలంలోని చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి టీ తాగి,  బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై హుస్సేన్‌బాష (6) అనే చిన్నారి మృతి   చెందగా..మరో ఇద్దరు ఆసుపత్రులో చేరిన విషయం విదితమే. వీరిలో హుస్సేన్‌బీ (4) అనే చిన్నారి కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ  సోమవారం మృతి చెందింది. మ‌రో చిన్నారి జమాల్‌మీ మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బిస్కెట్లు వికటించడం ఏంటన్న చర్చ సర్వత్రా సాగుతోంది.  ఘటనపై పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టులో తయారైన బిస్కెట్ల ప్యాకెట్‌పై మరో 18 నెలల గడువు ఉంది. అందులో కల్తీ ఉంటే అస్వస్థతకు గురవడం తప్పా మరణాలు సంభవించే పరిస్థితి చాలా అరుదని అధికారులే అంటున్నారు. దీంతో బిస్కెట్లలోనే ఎవరైనా విషం కలిపారా? లేక పాలు / టీలో విష ప్రయోగం జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చ‌ద‌వండి : (చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు ) 

హోల్‌సేల్‌ దుకాణం సీజ్‌  
చింతకొమ్ముదిన్నెలోని చిల్లర దుకాణానికి బిస్కెట్లు సరఫరా చేసిన ఆళ్లగడ్డ పట్టణంలోని సాయిరాం ఎంటర్‌ప్రైజెస్‌ హోల్‌సేల్‌ దుకాణాన్ని పోలీసుల సూచన మేరకు  రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. ఆహార భద్రత అధికారులు వచ్చి పరిశీలించే వరకు దుకాణాన్ని మూసేయడంతో పాటు అందులో ఉండే బిస్కెట్లు బయటకు వెళ్లకుండా సీజ్‌ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.  చిన్నారుల మృతి ఘటనపై తహసీల్దార్‌ రవి, ఐసీడీఎస్‌ అధికారిణి సుశీల సోమవారం తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారులు బిస్కెట్లు కొనుగోలు చేసిన దుకాణం నిర్వాహకునితో పాటు గ్రామంలో పలువురితో మాట్లాడి వివరాలు సేకరించారు. చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ విషయంపై ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి..దుకాణాన్ని సీజ్‌  చేయించాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశాం. పోస్టుమార్టం నివేదికలు  వస్తే ఎలా మృతి చెందారన్న విషయం బయటకు వస్తుంది' అని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు  తెలిపారు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top