మనోజ్‌ 'ఖజానా' చూస్తే కళ్లు తిరగాల్సిందే..

Anantapur: Treasury Department official Manoj Arrested - Sakshi

బంగారు, వెండి నిధి రహస్యాన్ని చేధించిన పోలీసులు

ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ అక్రమ సంపాదన గా గుర్తింపు

సాక్షి, అనంతపురం :  తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతగాడి నుంచి ఏడు బైక్‌లు, రెండు కార్లు, నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన అవినీతి సొమ్ము భద్రంగా ఉండేందుకే డ్రైవర్ ఇంట్లో 3.5 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని దాచిపెట్టినట్లు అనంతపురం జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది. 

బుక్కరాయసముద్రంలో వెలుగుచూసిన నిధి మొత్తం ట్రైజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్ అక్రమంగా సంపాదించినదే దర్యాప్తులో తేలింది.  వాటిని తన ఇంట్లో పెట్టుకుంటే భద్రత ఉండదని భావించిన మనోజ్ తన డ్రైవర్ నాగలింగ ఇంట్లో వీటిని దాచిపెట్టారని గుర్తించారు. ఒక రివాల్వర్, మరొక ఎయిర్ పిస్టల్‌తో పాటు రెండున్నర కిలోల బంగారం, 84 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ, ఆదాయపన్ను శాఖ దృష్టికి వివరాలు పంపుతామని అనంతపురం ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. మనోజ్‌కు కారు డ్రైవర్‌ నాగలింగతో పాటు మామ బాలప్ప సహకారం ఉన్నట్లు తెలిపారు. (8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు)

ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ కారు డ్రైవర్‌ బంధువు ఇంట్లో.. భారీఎత్తున అవినీతి 'ఖజానా' బయటపడిన విషయం తెలిసిందే. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. అయితే ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్‌ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి.. అంతా ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. (ఇంట్లో తవ్వకాలు; బంగారు నిధి పట్టివేత)

 


 


 


 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top