ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్‌ ఖాళీ

ACP Narasimha Reddy Second Locker Empty In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఏసీపీ వై.నరసింహారెడ్డి రెండో లాకర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం తెరిచారు. భారీగా నగదు, కీలక ఆధారాలు ఈ ఎస్‌బీఐ లాకర్‌లో లభిస్తాయని అధికారులు భావించారు. అయితే అది ఖాళీగా ఉండటంతో అవాక్కయ్యారు. రెండుమూడేళ్లుగా ఈ లాకర్‌ వినియోగంలోనే లేదని తెలుసుకుని వెనుదిరిగారు. మరోవైపు ఏసీపీకి బినామీలుగా వ్యవహరించిన వారి కోసం ఏసీబీ గాలింపు ముమ్మరం చేసింది. అందులో కొందరు నగరంలో లేరని, వారు ఫోన్లు కూడా అందుబాటులో లేవని సమాచారం. ఓ డీఐజీ ర్యాంకు అధికారికి బంగ్లా కొనివ్వ డంలో కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలపైనా ఏసీబీ దృష్టి సారించింది. రూ.4 కోట్ల విలువైన ఆ బంగ్లాను సదరు డీఐజీ ఇప్పటికే అమ్మేసుకున్నాడని తెలిసింది. (మేరే పీచే బాస్‌ హై!)

నెల ముందే తెలిసిందా...? 
తాను చేసే పనులకు డీజీపీ పేరును వాడుకున్న నరసింహారెడ్డికి డిపార్ట్‌మెంట్‌లో మంచి నెట్‌వర్క్‌ ఉంది. ఇటీవల ఏసీపీ జయరాంను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసిన వెంటనే.. తరువాత టార్గెట్‌ తానేనని గుర్తించి ఉంటాడని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి ఆయన ఎవరితోనూ ఫోన్లో వాయిస్‌ కాల్‌ చేయలేదని.. వాట్సాప్, ఇతర యాప్‌ల ద్వారా బినామీలను సంప్రదించినట్లు సమాచారం. లాకర్లలో తక్కువ స్థాయిలో బంగారం లభించడం, కీలక బినామీలు నగరంలో లేకపోవడం ఏసీబీ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అలాగే పలువురు రాజకీయ నాయకులతో కలసి చేసిన వ్యాపారాలు, నగరంలో పలు రియల్‌ ఎస్టేట్లలో నరసింహారెడ్డి పెట్టిన పెట్టుబడులపైనా ఏసీబీ ఆరా తీస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top