బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Accused gets life imprisonment in case of Molestation - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితకాల(మరణించే వరకు) కఠిన కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ ఎస్‌.రజిని బుధవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని భవానీపురానికి చెందిన మహిళకు మచిలీపట్టణానికి చెందిన వ్యక్తితో 2005లో వివాహం జరిగింది. అనివార్య కారణాలతో ఆమె భర్త నుంచి విడిపోయి భవానీపురంలోని తల్లి ఇంట్లో ఇద్దరు పిల్లలు(12 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప)తో కలిసి జీవిస్తోంది.

కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. 2021 జనవరి 30న యధావిధిగానే పిల్లలను తన తల్లికి అప్పజెప్పి కూలీకి వెళ్లింది. మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని అదే ప్రాంతంలో ఉండే షేక్‌ అయాజ్‌ అహ్మద్‌(49) పిలిచి తన ఇంటికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి అదే రోజు విజయవాడ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని మరుసటి రోజు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. బాధితుల తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.వి.­నారాయణరెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డాక్టర్‌ జి.కల్యాణి న్యాయస్థానానికి వాదనలు వినిపించారు. 15 మంది సాక్షులను విచారించిన అనంతరం నేరం రు­జువు కావడంతో నిందితుడు అయాజ్‌ అహ్మద్‌కు జీవి­తకాల కఠినకారాగార శిక్ష, రూ.2.31 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

నిందితుడు చెల్లించిన నగదులో రూ.1.66 లక్షలను బాధితురాలికి అందజేయాలని, అలాగే నిందితుడు మరో రూ.5 లక్షలు బాధితురాలికి చెల్లించాలని తీర్పులో పేర్కొ­న్నారు. అదేవిధంగా బాధితురాలికి రూ.4 లక్షలు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top