చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట పరిసరాల్లో మంగళవారం చిరుత సంచారం కలకలం రేపింది. ఓ మహిళా పులి..పులి అని కేకలు పెట్టడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఊరంతా రోడ్డుపైకి వచ్చేసింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించింది. ఈమేరకు అటవీశాఖ అధికారులు చిరుత ఆచూకీ కనిపెట్టేందుకు డ్రోన్లతో గాలింపు చేపట్టారు.
నాటు బాంబు పేలి
ఆవుకు గాయాలు
గుడిపాల: నాటుబాంబు పేలి ఆవు తీవ్రంగా గాయపడింది. గుడిపాల మండలంలోని బుచ్చన్నకండ్రిగకు చెందిన బాబునాయుడు అనే రైతుకు ఆవులు ఉన్నాయి. మంగళవారం సమీప అటవీప్రాంతంలో ఆవులు మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో అడవి పందుల కోసం వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును ఆవు తినేందుకు యత్నించడంతో అది పేలిపోయింది. దీంతో ఆవు దవడ భాగం ఛిద్రమైంది.
కారు బోల్తా..
మహిళ మృతి
కుప్పంరూరల్ : మండలంలోని నడుమూరు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం కారు బోల్తా పడడంతో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. రామకుప్పం మండలం కొల్లుపల్లెకు చెందిన చంద్రశేఖర్ భార్య లక్ష్మీదేవి (44) తమ కుమార్తె జననీ ఉద్యోగ నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు బయలుదేరింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో బెంగళూరు బస్సు ఎక్కించేందుకు లక్ష్మీదేవి, కుమారుడు చిరంజీవితో కలిసి జననీతో కారులో వెళ్లారు. జననీని కృష్ణగిరిలో బెంగళూరు బస్సు ఎక్కించి లక్ష్మీదేవి, చిరంజీవి స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. నడుమూరు వద్ద నగరవనం సమీపంలోని మలుపులో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిరంజీవికి ఎలాంటి గాయాలు కాలేదు. లక్ష్మీదేవి అపస్మారకస్థితికి చేరుకుంది. స్థానికులు 108 ద్వారా కుప్పం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో లక్ష్మీదేవి మృతి చెందింది. కాగా, ప్రమాదంలో లక్ష్మీదేవి, చిరంజీవిలకు ఎలాంటి రక్తగాయాలు కాకపోవడం గమనార్హం. లక్ష్మీదేవి గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గౌనితిమ్మేపల్లె పీడీఓ మృతి
బైరెడ్డిపల్లె : మండలంలోని స్వర్ణ గౌనితిమ్మేపల్లె పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) పి.గురుమూర్తి మంగళవారం బైరెడ్డిపల్లెలోని తన నివాసంలో అకస్మాత్తుగా మృతి చెందారు. గురుమూర్తి మృతికి ఎంపీడీఓ ఆనందబాబు సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా అంత్యక్రియ ఖర్చులకు మంజూరు చేసిన రూ.25 వేలను మృతుడి భార్యకు అందించారు. ఆనందబాబు మాట్లాడుతూ గురుమూర్తి అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ నరసింహులు, సిబ్బంది బాలాజీ, ఆదాం, సురేష్‌బాబు పాల్గొన్నారు.
రూ.2లక్షల
విద్యుత్ తీగలు చోరీ
పూతలపట్టు(యాదమరి): నిర్మాణంలని ఓ ఇంటిలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా రూ.2లక్షలు విలువైన విద్యుత్ తీగలను అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. .కొత్తకోట గ్రామంలోని బాలాజీనగర్‌కు చెందిన మోహన్‌రెడ్డి కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించి ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని దొంగలు ఆసరాగా చేసుకున్నారు. ఇంటికి అమర్చిన ఖరీదైన కరెంటు వైర్లతో పాటు మిగిలి ఉన్న తీగలను సైతం పూర్తిగా చోరీ చేశారు. సోమవారం విధులకు వచ్చిన కూలీలు తీగలు మాయమైన విషయాన్ని గుర్తించి యజమాని మోహన్‌రెడ్డికి సమాచారం అందించారు. సోమవారం ఈ మేరకు ఆయన పూతలపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాక్ ఇన్‌ఇంటర్వ్యూ
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా 12 నెలల పాటు నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. నర్సింగ్ విద్యను పూర్తి చేసిన యువతకు ప్రాయోగిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 81 నర్సింగ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక ఈనెల 23న వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు స్విమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


