ఒకటో సారి..! | - | Sakshi
Sakshi News home page

ఒకటో సారి..!

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

రూ.30 కోట్లు నుంచి రూ.50 కోట్లు పలుకుతున్న కుర్చీ

కూటమికి కలిసొచ్చిన జనరల్‌ మహిళా రిజర్వేషన్‌

కొంగుచాటు కృష్ణుడిగా

చక్రం తిప్పేందుకు ఆసక్తి

నల్లడబ్బు వెదజల్లి..

కుర్చీ కొనేందుకు తమ్ముళ్ల పోటీ

రూ.కోట్లు రాల్చుకుంటున్న

నియోజకవర్గ నేతలు

జెడ్పీ సమావేశపు హాలు

సాక్షి, చిత్తూరు: చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 60 డివిజన్లలో ఏకంగా 51 స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధి సమక్షంలో ఒక్కో కార్పొరేట్‌ స్థానానికి నిర్వహించిన వేలం పాటలో కనీస ధర రూ.16 లక్షలు, గరిష్ట ధర రూ.37 లక్షలు పలికింది. ఎవరెంత ఎక్కువకు పాడుకుంటే అంత మొత్తం తీసుకుని దొంగ సంతకాలతో ఏకగ్రీవాలు చేశారంటూ ఇప్పటికే ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తోంది. జనసేన–బీజేపీ ఎవ్వరైనా వేలం పాటలో పాడుకోవాల్సిందే. దీన్ని ఆదర్శంగా తీసుకున్న అధిష్టానం జిల్లా పరిషత్‌ జెడ్పీ స్థానాన్ని మార్కెట్‌లో వేలానికి ఉంచేసింది. పైగా చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు కావడంతో బాబు సామాజికవర్గానికి ద్వారాలు తెరిచేశారు. ప్రారంభ పాట రూ.30 కోట్లు, కుర్చీ రేటు గరిష్టంగా రూ.50 కోట్లు పలికే అవకాశాలున్నాయి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక కూడబెట్టిన సొమ్మంతా జెడ్పీ జూదంలో పోయడానికి తమ్ముళ్లు సిద్ధమైపోయారు.

డబ్బే డబ్బు..

ఇద్దరు ఆర్థిక బలవంతుల మధ్య పోటీ నెలకొనడంతో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఉన్న పచ్చ ప్రజాప్రతినిధులు అందినకాడికి నోట్ల కట్టలు రాల్చుకునే పనిలో పడ్డారు. గుడిపాలలో చోటివ్వడానికి ఇప్పటికే ఓ నాయకుడికి రూ.4 కోట్లు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రతి నియోజకవర్గంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధికి రూ.కోట్లు కప్పం కట్టడానికి వెనుకాడడం లేదు. పూతలపట్టుకు చెందిన పచ్చనేత తుది రేటుగా కుర్చీ కోసం రూ.38 కోట్లు బేరం మాట్లాడుకున్నట్లు సమాచారం. తాను మరో రూ.8 కోట్లు అదనంగా ఇస్తానని బంగారుపాళ్యం బిల్డర్‌ చెప్పడంతో తుదిగా జెడ్పీ పీఠం రూ.50 కోట్లు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోటీ ఆ ఇద్దరి మధ్యేనా..?

జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళది కావడంతో.. అందరి చూపు తొలుత బంగారుపాళ్యం, పెనుమూరు, వెదురుకుప్పం, పాలసముద్రం, కుప్పం, గుడుపల్లె వైపు పడింది. ఈ ఆరు మండలాల నుంచే ఆశావహులు ఉంటారని భావించారు. పాలసముద్రం, బంగారుపాళ్యం తప్ప మిగిలిన ప్రాంతాల్లో పచ్చ నేతలు ఆర్థికంగా బలంగా లేరు. దీంతో వారి కన్ను అన్‌–రిజర్వుడుగా ఉన్న గుడిపాల, పూతలపట్టుపై పడింది. ఫలితంగా బంగారుపాళ్యంలో స్థానిక లిక్కర్‌ కింగ్‌ తన చోటు ఎవ్వరికీ ఇవ్వనని తేల్చి చెప్పారు. అదృష్టవశాత్తు ఇక్కడి స్థానం టీడీపీ కోటాలో ఏకగ్రీవం కావడంతో బెంగళూరులో రూ.కోట్లకు పడగెత్తిన పచ్చనేత తన సతీమణిని గుడిపాలలో పోటీకి ఉంచారు. తానేమీ తక్కువ తినలేదని, పూతలపట్టులో ప్రజాప్రతినిధి తన భిక్షవల్లే గెలిచాడని.. ఇప్పుడు తన సతీమణిని ఎలాగైనా జెడ్పీ పీఠంపై కూర్చోపెడతానని శపథం చేసిమరీ రంగంలోకి దిగాడు. దీంతో అధికారపార్టీ నుంచి వీళ్లిద్దరిలో ఒకరు జెడ్పీ పీఠాన్ని వేలం పాటలో దక్కించుకుని.. ఓట్ల రంగంలోకి దిగుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఒకవేళ పీఠం దక్కించుకుంటే గతం ప్రభుత్వ హయాంలో సతీమణి వెనుక దాక్కుని కొంగుచాటు కృష్ణుడిగా పాలన సాగించిన వ్యక్తిలా వెలుగుదామనే భావనలో ఉన్నారు.

పచ్చ దుకాణంలో అమ్మకానికి చిత్తూరు జెడ్పీ పీఠం

కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన 29 నెలల్లో ఇసుక, గ్రానైట్‌, గ్రావెల్‌ను బెంగళూరు, తమిళనాడుకు అక్రమంగా తరలించి రూ.కోట్లు కూడబెట్టారు. భూ కజ్జాలు, ఉన్నత చదువుల కలలు కన్న నిరుపేల రక్తం పీల్చి రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇప్పుడు అధికార దర్పం కోసం పాకులాడుతున్నారు. ఇందులో భాగంగా జెడ్పీ పీఠాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.కోట్లు కుమ్మరించేందుకు సన్నద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement