జెడ్పీటీసీ అభ్యంతరాలను స్వీకరించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీటీసీల అభ్యంతరాలు స్వీకరించిన ఆయా డివిజన్ల ఆర్డీవోలు జెడ్పీటీసీకి అందిన 2 అప్పీళ్లూ తిరస్కరణ! ఎంపీటీసీలకు చిత్తూరు డివిజన్‌లో 5, నగరి డివిజన్‌లో 2 కుప్పం, పలమనేరు ఆర్డీవోల పరిధిలో నమోదు కాని అభ్యంతరాలు
చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం తిరస్కరణకు లోనైన జెడ్పీటీసీ అభ్యర్థులకు అప్పీళ్లలోనూ నిరాశే ఎదురైంది. జిల్లా పరిషత్ (జెడ్పీ) కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం అప్పీళ్ల పరిశీలన కార్యక్రమా న్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 181 నామినేషన్లు దాఖలు కాగా, ఈ నెల 24న నిర్వహించిన పరిశీలనలో 174 ఆమోదం పొందాయి. వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన 7 నామినేషన్లలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే జిల్లా ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వారిద్దరి అప్పీళ్లను జిల్లా ఎన్నికల అధికారి తిరస్కరించారు. యాదమరి జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థిని కె.పుష్పావతి ఓటరుగా నమోదు కాకపోవడంతో ఆమె నామినేషన్ ను తిరస్కరించారు. నిబంధనల ప్రకారం అభ్యర్థి గ్రామీణ ప్రాంతంలో ఓటరుగా ఉండడం తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. పులిచెర్ల జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అద్దంకి మునిరాజ్ నామినేషన్ పత్రాల్లో సాక్షి, అభ్యర్థి, ప్రతిపాదకుడి సంతకాలు లేకపోవడంతో పాటు ఆస్తుల వివరాలను నమోదు చేయకపోవడాన్ని అధికారులు గుర్తించి తిరస్కరించారు. మరోవైపు, ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణపై ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఆర్డీవోలు అభ్యంతరాలను స్వీకరించారు. చిత్తూరు డివిజన్ పరిధిలో మొత్తం 5 అభ్యంతరాలు వచ్చాయి. అందులో ఐరాల మండలం నుంచి 4, తవణంపల్లి మండలం నుంచి 1 ఉన్నాయి. తిరస్కరణపై 5 ఎంపీటీసీ స్థానాలకు అప్పీళ్లు అందాయి. నగరి డివిజన్ పరిధిలో 2 అభ్యంతరాలు నమోదయ్యాయి. కుప్పం, పలమనేరు డివిజన్ల పరిధిలో ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదు. ఆదివారం నాటితో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా, నమోదైన ఎంపీటీసీ అప్పీళ్లపై ఆర్డీవోలు సోమవారం అభ్యర్థుల సమక్షంలో విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు.


