తమిళనాడు రౌడీలతో దాడులు | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు రౌడీలతో దాడులు

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

● ఎమ్మెల్యే థామస్‌ కనుసన్నల్లోనే నాపై దాడి ● ఇలాంటి సంప్రదాయం ప్రమాదకరం ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

వెదురుకుప్పం: రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి అన్నదమ్ముళ్లుగా కలిసి మెలసి ఉన్న గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో తమిళనాడు సంప్రదాయాలు రాజ్యమేలుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కే. నారాయణస్వామి ఆరోపించారు. ఆయన ఆదివారం పుత్తూరులోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే థామస్‌ రెండున్నరేళ్లుగా అల్లర్లు, దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు చేయిస్తున్నాడని తెలిపారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఎవరిపైనా కక్షసాధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అలాంటి తనపై ఎమ్మెల్యే థామస్‌ ఉద్దేశపూర్వకంగానే చిత్తూరులో దాడికి పురిగొల్పాడన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో స్థానిక ఎన్నికల్లో గెలవలేమన్న దుర్బుద్ధితో చైన్నె నుంచి సుమారు 2 వేల మంది రౌడీలు, గుండాలను తీసుకువచ్చి అల్లర్లకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ఇందుకేనా మీకు ప్రజలు ఓటు వేసింది అని ప్రశ్నించారు? నియోజకవర్గ ప్రజలకు మంచి చేయని ఎమ్మెల్యే థామస్‌ స్థానిక ఎన్నికలు సవాల్‌గా మారడంతో అడ్డదారులు తొక్కి పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రాక్షసతత్వానికి బీజం వేస్తున్నట్లు మండిపడ్డారు. చైన్నె నుంచి తీసుకువచ్చిన 600 మంది గుండాలతో వెదురుకుప్పం, కార్వేటినగరంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను కొట్టించి నామనేషన్‌ పత్రాలను చించివేశారని తెలిపారు. శ్రీరంగరాజపురం, గంగాధరనెల్లూరు మండలాల్లో మహిళలని చూడకుండా కీచకపర్వానికి తెరలేపడం బాధాకరమన్నారు. పెనుమూరు జెడ్పీటీసీ అభ్యర్థిని నామినేషన్‌కు వెళ్లిన తనపై దాడులకు పాల్పడ్డారని వాపోయారు. తాను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగానని తెలిపారు. స్క్రాచ్‌ కార్డులు ఇచ్చి పేద ప్రజలకు ద్రోహం చేశానా? ఉద్యోగాల పేరుతో కమీషన్లు తీసుకున్నానా? ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నానా? అని నిలదీశారు. ఇదేనా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి చేసే అభివృద్ధి పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి ప్రజల ఓట్లతో పదవులు పొందాల్సింది పోయి దాడులు చేసి నీచ సంస్కృతికి ఆజ్యం పోస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాల్సిందిపోయి భయభ్రాంతులకు గురిచేస్తారా అని మండిపడ్డారు. దాడుల సంస్కృతికి స్వస్తి పలికి ప్రజల మన్ననలు పొందాలని హితవుపలికారు. నిజాయితీగా నిశ్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న తనపై చేసిన దాడిని మరిచిపోలేనన్నారు. ఒక దళితుడన్న భేదం లేకుండా ఇన్నేళ్లుగా తనను ఆదరించి అక్కున చేర్చున్న నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణ త్యాగానికై నా వెరవనని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement