సాక్షి ప్రతినిధి, తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ వేళ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో టీడీపీ మూకలు అలజడి సృష్టించారు. పచ్చ మూకల దౌర్జన్యాలు.. దాడులతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అనేక మంది ఇంటి తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారు. తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ జేబీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను చించేసి, దాడులకు తెగబడడం విమర్శలకు దారితీసింది.
అల్లరిమూకల అరాచకం
నగరంలోని కొర్లగుంట, బైరాగిపట్టెడ, ఎస్టీవీ నగర్, ఎంఆర్పల్లి, జీవకోన, చెన్నారెడ్డి కాలనీ, అనంతవీధి పరిధిలోని డివిజన్లకు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ అల్లరి మూకలు దాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా నామినేషన్ పత్రాలను అభ్యర్థుల నుంచి బలవంతంగా లాక్కుని చించివేశారు. రామానాయుడు ప్రభుత్వ పాఠశాలలోని ఎన్నికల కేంద్రంలో తన వాళ్లకు మద్దతుగా నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు.
తొలిరోజే అలజడి
గతంలో ఎప్పుడూ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికల వేళ ఇలాంటి అల్లర్లు జరిగిన దాఖలాలు లేవు. ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిపై భౌతికదాడికి పాల్పడిన ఉదంతాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదటి రోజే తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి.
ముందే మోహరించి.. ఆపై అడ్డగించి
వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్నారని తెలుసుకుని టీడీపీ రౌడీలు అక్కడక్కడా మోహరించారు. నామినేషన్ పత్రాలను వైఎస్సార్సీపీ అభ్యర్థుల నుంచి లాక్కుని చించివేశారు. ఇదే సందర్భంలో భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డిపైనా దాడికి యత్నించారు. శుక్రవారం ఉదయం నుంచి టీడీపీ మూకలు వార్డు సచివాలయాల వద్ద మోహరించడం గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నివాసంలో నుంచి బయటకు రాకుండా.. తలుపులు వేసుకుని నివాసంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.
కూటమికి ఓటమి భయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతుండడంతో కూటమి నాయకులు అరాచక రాజకీయాలకు తెరలేపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, మేయర్ పీఠాన్ని అక్రమంగా కైవసం చేసుకునేందుకు కూటమి గూండాలు బరితెగించారు. నగరంలోని పలు డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేసి, పత్రాలను చించేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
భూమన అభినయ్రెడ్డిపై భౌతిక దాడి
రామానాయుడు ప్రభుత్వ పాఠశాలలోని నామినేషన్ కేంద్రంలో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డిపై టీడీపీ గూండాలు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఒక ప్రధాన రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిపైనే అధికార పార్టీ మూకలు దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది. ఇదే సమయంలో సీనియర్ నాయకులు భూమన కరుణాకరరెడ్డిపైనా కవ్వింపు చర్యలకు దిగారు. శుక్రవారం ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ మూకలు వీరంగం సృష్టించడంతో స్థానిక ప్రజలు, ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పచ్చ మూకల దౌర్జన్యాలు, దాడులతో వణికిపోయిన నగరవాసులు తమ ఇళ్ల తలుపులు వేసుకుని, బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలీసుల సమక్షంలోనే ఈ అరాచకాలు సాగినా పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రంలో టీడీపీ అల్లరి మూకలు బరితెగించారు. స్థానిక ఎన్నికల్లో అల్లర్లు సృష్టించి ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు. నామినేషన్లు వేయనీయకుండా ఎక్కడికక్కడ మోహరించి అభ్యర్థులను అడ్డగించారు. నామినేషన్ పత్రాలు లాక్కుని పోలీసుల ఎదుటే చించివేసి వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నామినేషన్ కేంద్రాల్లోకి చొరబడి అధికారుల ఎదుటే అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. వీరి ఆగడాలతో నగర ప్రజలు సైతం భయంతో వణికిపోయారు. ఇళ్లకు తలుపులు వేసుకుని ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఈ అరాచక పర్వంపై స్థానికులు మండిపడుతున్నారు. జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.


