సతీమణే చంపిందా? | - | Sakshi
Sakshi News home page

సతీమణే చంపిందా?

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

● తమిళనాడు వాసి హత్య కంగుంది వ్యక్తి పనేనా? ● హత్యకు దారితీసింది వివాహేతర సంబంధమేనా? ● ప్రియుడితో కలిసి భార్యే భర్తను హతమార్చినట్టు అనుమానాలు ● పరారీతో నిందితుడు

కుప్పంరూరల్‌: తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని హత్య చేసి కుప్పం మండలం, నాయనూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన విషయం విదితమే. గురువారం హత్యకు గురైన తమిళనాడు వాసి మృతదేహాన్ని బయటికి తీసిన కుప్పం పోలీసులు పోస్టుమార్టమ్‌ నిర్వహించి బంధువులకు అప్పగించారు. హతుడు తమిళనాడు రాష్ట్రం కరంబూరుకు చెందిన శశికుమార్‌ (42)గా గుర్తించారు. పోస్టుమార్టమ్‌ అనంతరం మృతదేహాన్ని శుక్రవారం బంధువులకు అప్పగించారు. కాగా హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణాలు ఏమిటి? నాయనూరు అటవీ ప్రాంతంలోనే ఎందుకు పూడ్చారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మృతదేహాన్ని గుర్తించింది ఇలా..

గురువారం కుప్పం మండలం నాయనూరు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులకు అడవిలో ఓ చోట రక్తపు మరకలు కనిపించాయి. ఆ విషయం పోలసులకు చేరవేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. హత్యచేసి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీశారు. ప్రాథమికంగా హత్యకు గురైన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం కరంబూరుకు చెందిన శశికుమార్‌గా గుర్తించారు. శవానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించి శుక్రవారం ఉదయం బంధువులకు అప్పగించారు. హత్యకు దారి తీసిన విషయాలపై కుప్పం పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

హత్యచేసింది కంగుంది వ్యక్తా?

కరంబూరుకు చెందిన శశికుమార్‌ను హత్య చేసింది కుప్పం మండలం, కంగుంది వాసిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంగుందికి చెందిన ఓ వ్యక్తి కూలీ పనుల నిమిత్తం కరంబూరుకు వెళ్ళాడు. అక్కడ పనులు చేసుకుంటూ శశికుమార్‌ ఇంట్లోనే బాడుగకు దిగాడు. కొద్ది రోజులకు శశికుమార్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినట్లు తెలిసింది.

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని..

తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అడ్డు తప్పించాలని శశికుమార్‌ భార్య, ఆమె ప్రియుడు పన్నాగం పన్నాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం రోజు శశికుమార్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. మంగళవారం భర్త శశికుమార్‌, భార్యతో కలసి ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఆ తర్వాత భార్య మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే గ్రామంలో పలు అనుమానాలు రేకెత్తాయి. శశికుమార్‌ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి నాయనూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లు ఊరుకి వచ్చేసిందని అనుమానాలున్నాయి. ఇదిలా ఉండగా సంఘటన జరిగిన మంగళవారం నుంచి ఆమె ప్రియుడు అజ్ఞాతంలోకి వెళ్లి పోయినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె కూడా కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement