సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు నగరపాలక సంస్థలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా పారిశుద్ధ్య కార్మికుల వైద్య శిబిరం ప్రోటోకాల్ రచ్చకు నిలయంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అండదండలతో అధికార పక్షానికి చెందిన మాజీ మేయర్ ఆముద, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డిలను వేదికపై ఆశీనులను చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను అధికారులు మట్టిలో కలపడంపై స్థానికులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల హోదా లేని మాజీలకు అగ్ర స్థానం ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పదవులు లేకపోయినా వేదికపైకి చేరేలా అధికారులే సహకరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియమ నిబంధనలను పక్కనబెట్టి, ప్రొటోకాల్‌ను గాలికి వదిలేసిన అధికారుల వైఖరిపై విమర్శల పరంపర కొనసాగుతోంది.


