‘కమర్షియల్’కే పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
కాణిపాకం: వంటగ్యాస్ వినియోగదారులపై ప్రభుత్వం, చమురు సంస్థలు కలిసి మరో భారం మోపేందుకు యత్నిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్ యుద్ధ పరిణామాలతో గ్యాస్ కొరత వచ్చి పడితే, మరోవైపు ఈ–కేవైసీ పేరుతో సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చి సామాన్య, మధ్యతరగతి ప్రజల గొంతు నులిమేందుకు కుట్ర చేస్తున్నాయి. గడువులోపు ఆధార్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పూర్తి చేయలేదనే సాకుతో సబ్సిడీని ఎగ్గొటేందుకు సన్నద్ధమవుతున్నాయి. రాయితీ సిలిండర్లను సైతం కమర్షియల్ ధరలకు విక్రయించేందుకు బాటలు వేస్తున్నాయి. సర్కారు వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లక్షలాది మందికి తిప్పలు
జిల్లాలో మొత్తం 12 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, సాధారణ ఎల్పీజీ కనెక్షన్లు 5,00,116 ఉండగా, కమర్షియల్ కనెక్షన్లు 2,980 వరకు ఉన్నాయి. ఈ గణాంకాల మేరకు జిల్లాలో లక్షలాది కుటుంబాలు గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమై ఓవైపు పొయ్యి వెలగడమే కష్టంగా మారితే, మరోవైపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తికాక జిల్లాలోని వేలాది కనెక్షన్లు బ్లాక్ అయిపోవడం ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇక కొత్తగా గ్యాస్ కనెక్షన్ కోసం సుమారు 80 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరికి వంట గ్యాస్ పంపిణీ చేయకుండా వివిధ కారణాలతో ఐదు, 10 కేజీల సిలిండర్ ను అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు గ్యాస్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.
ఫ్రీ ట్రేడ్ లైసెన్స్ మెలిక
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కొత్తగా కనెక్షన్ కావాలన్నా లేదా ఈ కేవైసీ కాక పాత కనెక్షన్లు బ్లాక్ అయినా వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. కనెక్షన్ పొందేందుకు ఐదేళ్లు, పదేళ్లుగా నిరీక్షిస్తున్న పేద కుటుంబాలను, కొత్తగా కాపురం పెట్టిన దంపతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు.. వారిని ఫ్రీ ట్రేడ్ లైసెన్స్ కమర్షియల్ సిలిండర్ల వైపు నెడుతున్నాయి. ఎఫ్‌టీఎల్ కమర్షియల్ సిలిండర్ల (5 కిలోలు లేదా 10 కిలోలు) విక్రయాలకు ఎలాంటి ఆధార్, రేషన్ కార్డు లేదా స్థానిక నివాస ఆధారాలు అవసరం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. రూ. 976 చెల్లించి లేదా డిపాజిట్ ఇచ్చి ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లవచ్చని మెలిక పెడుతున్నాయి. గృహ వినియోగానికి వాడే 14.2 కేజీల సాధారణ సిలిండర్ల సరఫరాకు ఆంక్షలు విధిస్తూ, చిన్న కమర్షియల్ సిలిండర్లను అంటగట్టి ప్రజల జేబులకు చిల్లు పొడుస్తున్నాయి.
సాంకేతిక చిక్కులు
జిల్లా వ్యాప్తంగా దాదాపు 30, 40 ఏళ్ల క్రితం ఇంట్లోని పెద్దల పేరిట తీసుకున్న పాత గ్యాస్ కనెక్షన్లు నేటికీ భారీ సంఖ్యలో ఉన్నాయి. ఆయా కనెక్షన్ల యజమానులు మరణించడం, వారి లీగల్ వారసుల పేరిట మార్చుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆయిల్ కంపెనీలు కనెక్షన్లను నిలిపివేశాయి. మైనర్ ఫ్యామిలీలుగా విడిపోయిన కుటుంబాలు, ఒకే ఇంట్లో వేర్వేరు రేషన్ కార్డులు ఉన్నవారు సరైన ప్రూఫ్ చూపించలేక సతమతమవుతున్నారు. బ్లాక్ అయినవాటికి ఈకేవైసీ కాకపోవడంతో వేలాది గ్యాస్ కనెక్షన్లు బ్లాక్ అయిపోయాయి. దీంతో, జిల్లాలో సామాన్యులు పొయ్యి వెలిగించుకోవడానికి తంటాలు పడుతున్నారు.
కొత్త నిబంధనలతో రాయితీ ఎగవేత
నష్టాల భర్తీకే ఈ దోపిడీ?
అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం కారణంగా, దిగుమతి వ్యయం పెరిగిందనే సాకుతో గృహ వినియోగ విభాగంలో తమకు వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకే చమురు సంస్థలు ఈ కుతంత్రానికి తెరలేపాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గృహ కనెక్షన్లకు కొత్తగా ఆమోదం తెలపకుండా నిలిపివేస్తూ, వినియోగదారులను కమర్షియల్ కేటగిరీకి మళ్లించడం ద్వారా లాభాలు దండుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవైపు కొరత, ధరల భారంతో విలవిలలాడుతున్న సామాన్యుడిపై, ఇప్పుడు ఈకేవైసీ, కమర్షియల్ బాదుడు పేరుతో నిలువుదోపిడీకి దిగడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.


