అమ్మా.. అలసత్వం! | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. అలసత్వం!

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో అంకెల గారడీ

టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవం

పారదర్శకతకు పూర్తిస్థాయిలో మంగళం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లావ్యాప్తంగా చిత్తూరులో 7, నగరిలో 2, పలమనేరులో 2, కుప్పంలో 2 చొప్పున మొత్తం 13 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ’హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను అమలులోకి తీసుకువచ్చింది. దీనిపై ఆగస్ట్‌ 27, 28 తేదీల్లో జిల్లా అధికారులకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

ఆధార్‌తో లేని లింక్‌

నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎనన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాలు, వార్డుల్లో సర్వే చేసి అర్హులైన దంపతుల సమాచారాన్ని ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి. అనంతరం ఆధార్‌ సంఖ్యను ఐడీతో లింక్‌ చేయాల్సి ఉంది. ప్రతి గర్భిణివివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. అలాగే వారికి అందిస్తున్న రక్తహీనత నివారణ ఐరన్‌ మాత్రలు, ఇతర పోషకాహార లోపాలను గుర్తిస్తూ ప్రతి నెలా 1వ తేదీ నాటికి హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో పూర్తి స్థాయి డేటాను అప్‌లోడ్‌ చేయాలి.

కేవలం సంఖ్యల ప్రదర్శన

అయితే, ఇవేమీ పట్టని చిత్తూరు నగరంలోని పలు అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ఏఎన్‌ఎంలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గర్భిణుల పూర్తి వివరాలు నమోదు చేయకుండా, కేవలం ఏదో ఒక సంఖ్యను పోర్టల్‌లో చూపి తమ పని పూర్తయిందని చేతులు దులుపుకుంటున్నారు. చాలా చోట్ల గర్భిణుల అసలు వివరాలే రికార్డుల్లో లేకపోవడం గమనార్హం.

తనిఖీల్లో గుట్టురట్టు

ఇటీవల చిత్తూరు నగరంలోని కాజూరు అర్బన్‌ హెల్త్‌ పరిధిలోని బాలాజీనగర్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ నమోదును పరిశీలించగా నివ్వెర పరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్టల్‌లో గర్భిణుల సంఖ్య మాత్రమే కనిపించడం, వారి వివరాలు ఏమీ లేకపోవడంతో అధికారులు షాక్‌ తిన్నారు. కేవలం పేపర్‌ మేకప్‌ కోసమే లెక్కలు చూపిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డు స్థాయిలో పూర్తి వివరాలు ఉంటేనే సరైన చికిత్స, మందులు అందే అవకాశముంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్‌ పోర్టల్స్‌ నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారు. అంకెల గారడీతో పారదర్శకతకు మంగళం పాడుతున్నారు. పేద మహిళలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాల్సిన వ్యవస్థను నీరుగారుస్తున్నారు.

జిల్లాలోని గర్భిణుల లెక్కల్లో నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement