పాలసముద్రం : మండలంలోని శ్రీకావేరిరాజుపురం పంచాయతీలో చేపట్టిన రీ సర్వేలో విలేజ్ సర్వేయర్ చేతివాటం ప్రదర్శించారు. ఓ మధ్యవర్తిని పెట్టుకుని గ్రామ సేవకుడు, వీఆర్‌ఓ లేకుండానే రైతుల భూములను ఆన్‌లైన్‌లో పెట్టాడు. తరువాత 9(2) నోటీస్‌ను రైతులకు ఇచ్చారు. అందులో భూముల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో రైతులు వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సదరు సర్వేయర్ పట్టించుకోకుండా తహసీల్దార్ నుంచి ఆర్‌డీఓ, తర్వాత జేసీ లాగిన్‌కి అప్‌డేట్ చేశాడు. ఇలా శ్రీకావేరిరాజుపురం పంచాయతీలో జరిగిన రీ సర్వేలో విలేజ్ సర్వేయర్ చేస్తున్న అక్రమాలు అంతులేదు. భూమి ఉన్నవారు ఆన్‌లైన్‌లో పెట్టాలని వస్తే, మీ పేరు మీద భూమి లేదంటున్నారు. తీరా భూమిపై ఉంటే మీ పేరుమీద రికార్డులు లేవంటున్నారు. కేవలం మధ్యవర్తి చెప్పివారి వివరాలనే ఆన్‌లైన్‌లో పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఎకరాకు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విలేజ్ సర్వేయర్ చర్యలు తీసుకుని, శ్రీకావేరిరాజుపురంలో మళ్లీ రీసర్వే చేయించాలని రైతులు కోరుతున్నారు.
రెండు బైక్‌ల ఢీ : ముగ్గురికి గాయాలు
కుప్పంరూరల్ : పట్టణంలోని తంబిగానిపల్లె వాణిమహల్ వద్ద వద్ద మంగళవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
దివ్యాంగురాలి మృతిపై
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరులో దివ్యాంగ మహిళ అదృశ్యమై, నదిలో మృతదేహంగా తేలిన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. జనవరిలో బాధితుల తరఫున ఫిర్యాదు అందినా పోలీసులు రొటీన్ మిస్సింగ్ కేసుగా భావించి ఎలాంటి ప్రొటోకాల్ పాటించలేదని కమిషన్ గుర్తించింది. ఈ ఉదాసీన వైఖరి కారణంగానే బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ, కమిషన్ సభ్యులు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నాలుగు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఎస్పీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిపై చిత్తూరుకు చెందిన న్యాయవాది హర్షద్ అయుబ్‌ఖాన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
విద్యార్థుల ఘర్షణ
పాలసముద్రం : మండలంలోని నరసింహపురానికి చెందిన ఏడుగురు విద్యార్థులకు మంగళవారం టీవీఎన్‌ఆర్ పురం నుంచి చిత్తూరులోని కళాశాలకు బయలుదేరారు. టీవీఎన్‌ఆర్‌పురంలో బస్సు ఎక్కిన అక్కడి విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. దీనిపై టీవీఎన్‌ఆర్‌పురం విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శివశంకర్ స్పందిస్తూ ఒకే పంచాయతీకి చెందిన విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉండాలని, మరోసారి గొడవ పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


