చిత్తూరు కలెక్టరేట్: బడి గంట మోగింది.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి, విద్యార్థులు శ్రద్ధగా వినాలి. కానీ, చిత్తూరు కొంగారెడ్డిపల్లెలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఉదయం 10:49 గంటలకు పాఠశాల తరగతులు నిర్వహిస్తున్న సమయంలో, స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థినులు చేతిలో ప్లాస్కులు పట్టుకుని రోడ్డుపై ఉన్న టీ స్టాల్‌కు వచ్చారు. ఆ యజమానికి ప్లాస్కులు ఇచ్చి టీ నింపుకుంటున్న సన్నివేశం చూసిన అక్కడున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. అటెండర్లు, సిబ్బంది చేయాల్సిన పనులను చదువుకోవడానికి వచ్చిన ఆడపిల్లలతో చేయించడమేంటి? అదీ రోడ్డు మీదకు పంపించి.. టీ తెప్పించడమేంటి? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రమేమిటంటే.. ఒకవైపు జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యటన జరుగుతోంది. బాలల హక్కుల కోసం అధికారులు సమీక్షలు చేపట్టిన రోజే, పాఠశాల యాజమాన్యం విద్యార్థినులను ఇలా అటెండర్లుగా మార్చడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు డీఈఓ లక్ష్మీనారాయణ దృష్టికి వెళ్లాయి. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడిన డీఈవో, సంబంధిత షర్మన్ పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, సిబ్బందిని వెంటనే సాయంత్రం డీఈవో కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలతో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీఈవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులతో ఇలాంటి పనులు చేయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమగ్రంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


