గంగాధర నెల్లూరు : మండలంలోని వింజం పెద్ద చెరువులో ఆదివారం రాత్రి మట్టి తరలించడానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. బాలగంగానపల్లె పంచాయతీ మేనటంపల్లెకు చెందిన కృష్ణారెడ్డి(60) వింజం పెద్ద చెరువులో ఆదివారం మట్టి తోలడానికి నిమిత్తం ట్రాక్టర్‌లో వెళుతుండగా రోడ్డు బాగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డిని వెంటనే 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కృష్ణారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
30 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు గడువు
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్‌లకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రూ.200 అపరాధ రుసుము చెల్లించాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను మీ సేవ, ఏపీఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమన్వయ కేంద్రాల్లో అడ్మిషన్ పొందాలన్నారు. ఇతర వివరాలకు డీఈఓ కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ అధికారులను సంప్రదించాలని కోరారు.
ఒంటరి ఏనుగు బీభత్సం
బైరెడ్డిపల్లె : మండలంలోని వెంగంవారిపల్లె సమీపంలో ఉన్న కొత్తచెరువు, మునినాయనచెరువు పరిసరాల్లో 15 రోజులుగా ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ఒంటరి ఏనుగు పంటలను తొక్కినాశనం చేస్తోందని వాపోతున్నారు. సోమ వారం పట్టపగలే పంటలను విధ్వంసం చేస్తూ వెంగంవారిపల్లె సమీపంలోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్ అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని సైతం ధ్వంసం చేసిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోకుంటే ఒంటరి ఏనుగు కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదముందని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టెండర్‌లో అక్రమాలపై ఫిర్యాదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షల అనంతరం సరఫరా చేసే కళ్ల జోళ్ల టెండర్ ప్రక్రియలో అక్రమాలు, సిండికేట్ వేధింపులపై తిరుపతికి చెందిన శివ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి గంగాసింగ్, తమిళనాడులోని వేలూరుకు చెందిన మహా శివ్ ఆఫ్టికల్స్ ప్రతినిధి మహేంద్రసింగ్ ఫిర్యాదు చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్‌కు వారు విడివిడిగా వినతిపత్రాలు సమర్పించారు. డిమాండ్ డ్రాఫ్ట్ సాంకేతిక సాకులు చూపి తనను టెండర్ నుంచి తప్పించారని గంగాసింగ్ ఆరోపించగా, తమిళనాడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ సాకుతో అడ్డుకున్నారని మహేంద్రసింగ్ పేర్కొన్నారు. అలాగే తమను టెండర్ వేసేందుకు కార్యాలయ ప్రాంగణంలోకి రాకుండా భౌతికంగా అడ్డుకున్నారని వినతిపత్రంలో వెల్లడించారు. కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు టెండర్లు దాఖలు చేశారని ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం బాధితులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలిశారు. ఈ వ్యవహారంపై స్పందించిన అధికారులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారా నివేదిక తెప్పించుకుని, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి, పారదర్శకంగా తిరిగి టెండర్లు నిర్వహించాలని, లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారులు తెలిపారు.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
– నాలుగు స్కూటీలు స్వాధీనం
బంగారుపాళెం: ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలంలోని కాటప్పగారిపల్లె, నలగాంపల్లెల్లో ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం మండలంలోని తంబుగానిపల్లె క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చిత్తూరు, బంగారుపాళెం పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను వారు అపహరించినట్లు వెల్లడించారు. కాటప్పగారిపల్లె సమీపంలో మూసివేసిన ఓ ఫ్యాక్టరీ ఆవరణలో నిందితులు దాచిపెట్టిన నాలుగు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా, ఆంబూరు తాలూకావడపుదుపట్టు ఓల్ట్ కాలనీకి చెందిన విఘ్నేష్(20), పేర్నంబట్ తాలూకా పుదూర్‌కు చెందినచంద్రుభీమన్(24), పేర్నంబట్ తాలూకా ఎస్‌ఆర్ కుప్పంలో నివాసముంటున్న విజయ్(26)ను నిందితులుగా గుర్తించినట్లు వివరించారు. సమావేశంలో ఎస్‌ఐ ప్రసాద్ పాల్గొన్నారు.


