చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)కు అర్జీదారులు పోటెత్తారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు, నిరుపేదలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. పింఛన్లు, భూ సమస్యలు, ఉపాధి, నివాస స్థలాలు, వైద్య సహాయం తదితర అంశాలపై అర్జీదారులు పెద్ద సంఖ్యలో వినతిపత్రాలను అందజేశారు. ఉన్నతాధికారులు నేరుగా అర్జీలను స్వీకరించి, బాధితుల గోడును అడిగి తెలుసుకున్నారు. స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని, నిర్దేశిత గడువులోగా సంబంధిత శాఖలకు పంపి వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై ఏమాత్రం అలసత్వం వహించకుండా పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ వెంకటేష్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


