చిత్తూరు కలెక్టరేట్ : హాస్టల్ వార్డెన్ వేధింపులు తాళలేకపోతున్నానని, అందరి ముందూ కులం పేరుతో దూషిస్తూ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పదో తరగతి విద్యార్థి జశ్వంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం ఆ విద్యార్థి తన తండ్రి మురళితో కలిసి కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థి కథనం ప్రకారం.. ఇటీవల ఉన్నతాధికారులు పూతలపట్టు ఎస్సీ బాలుర హాస్టల్ తనిఖీకి వచ్చిన సమయంలో భోజనం బాగాలేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న వార్డెన్, అప్పటినుంచి తనను లక్ష్యంగా చేసుకుని విద్యార్థులందరి ముందూ కులం పేరుతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వార్డెన్ వేధింపుల కారణంగా భయాందోళనకు గురైన సదరు విద్యార్థి, ప్రస్తుతం హాస్టల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నట్లు చెప్పాడు. విద్యార్థి తండ్రి మాట్లాడుతూ ఇటీవలే తమ పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ శోకంలో ఉన్న తమ కుటుంబానికి ఇప్పుడు చిన్న కుమారుడిని వార్డెన్ ఇలా వేధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. హాస్టల్‌లో భోజనం బాగాలేదని ఉన్నతాధికారులకు నిజం చెప్పడమే తన కుమారుడు చేసిన తప్పా అని ప్రశ్నించారు. కుమారుడి భవిష్యత్తు పాడవుతుందేమోనని ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన వార్డెనన్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.


