చిత్తూరు కలెక్టరేట్ : బాలల హక్కుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్య నారాయణ రాజు తెలిపారు. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆయనకు చిత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గిరింపేటలోని నగరపాలక హైస్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో కమిషన్ సభ్యులు పద్మలతతో కలసి ఆయన పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి జీవించే, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ, భాగస్వామ్య హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు అవసరమైన విద్య, పౌష్టికాహారం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించడం కమిషన్ బాధ్యతని వెల్లడించారు. బాలల రక్షణలో పాఠశాల స్థాయి నుంచే గుడ్ టచ్ బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పాఠశాలలో, సమాజంలో బాలల హక్కులకు భంగం వాటిల్లితే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు పెళ్లి చేయడం చట్టవిరుద్ధమన్నారు. ప్రత్యేకించి బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ బాల్య వివాహాలను అడ్డుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కమిషన్ సభ్యులు పద్మలత మాట్లాడుతూ బాలల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి సుబ్రమణ్యం, డీవైఈఓ ఇందిరా, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్ పాల్గొన్నారు.


