చిత్తూరు రూరల్ మాపాక్షి దళితవాడకు చెందిన శంకరయ్య తన నివాసం వద్ద ఉన్న ప్రమాదకర పరిస్థితిని వివరించారు. తన ఇంటి పైనుంచి వెళుతున్న విద్యుత్ లైన్ చేతికి అందేంత తక్కువ ఎత్తులో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారని, ఏదైనా ప్రమాదం సంభవించకముందే ఆ విద్యుత్ లైన్‌ను తొలగించాలని వేడుకున్నారు. స్థానిక విద్యుత్ అధికారులకు విన్నవించినా కనీస స్పందన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
షెడ్యూల్ భూముల్లో అక్రమాలు
ఎస్‌ఆర్ పురం మండలం, పెద్దకొండేపల్లెకు చెందిన గ్రామస్తులు కలెక్టర్‌ను కలసి అర్జీ అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని షెడ్యూలు భూములపై కొందరు తప్పుడు రికార్డులు సృష్టించి మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. గతంలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో జరిగిన విచారణలో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. మోసానికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.


