జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 30న చివరి గడువు
కేంద్రప్రభుత్వ విజ్ఞాన్ మథన్‌కూ సెప్టెంబర్ 30 వరకు అవకాశం
జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే స్కాలర్ షిప్
తిరుపతి సిటీ: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ సరికొత్త కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు, విజ్ఞాన్.. మంథన్ స్కాలర్ షిప్ పోటీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
బాల మేధావులకు అవకాశం
విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 32వ జాతీయ బాలల కాంగ్రెస్ పోటీలను (ఎన్‌సీఎస్‌సీ) దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. అన్ని రకాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులే. ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈనెల 30లోపు ఈ పోటీలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు విద్యార్థులు టీమ్‌గా ఏర్పాడి ఓ గైడ్ పర్యవేక్షణలో ప్రధానంగా ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, భారతీయ విజ్ఞాన వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ చూపితే రాష్ట స్థాయిలో రాణించాలి. రాష్ట స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుతో పాటు మరిన్ని వివరాలపై ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు సమాచారం అందించారు. సైన్స్ ఉపాధ్యాయులను సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవడానికి సులువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రతిభకు పట్టం
విద్యార్థుల ప్రతిభను జాతీయ స్థాయిలో పరీక్షించి ప్రొత్సహించేందుకు కేంద్రప్రభుత్వం విజ్ఞాన్..మంథన్ పేరుతో ప్రతిభాన్వేషణ్ పరీక్షను నిర్వహిస్తోంది. ఆరవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష తెలుగుతో పాటు 14 భాషల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ చివరి గడువు. అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పాఠశాల స్థాయి తొలి లెవల్ పరీక్షను నిర్వహించనున్నారు. నాలుగు స్టేజ్‌లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాది పాటు భాస్కరా స్కాలర్‌షిప్‌లను కేంద్రప్రభుత్వం అందించనుంది. రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు httpr://vvm.orf.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.


