‘నైలెట్ ’ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలి
తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం లోకసభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాల న్నారు. ప్రస్తుతం శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూ కేటాయింపు, డీపీఆర్ సమర్పణ వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, నైలెట్ సంస్థ మధ్య చర్చల్లో ఉన్నాయని కేంద్రం ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి శాశ్వత క్యాంపస్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. అలాగే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాధిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్‌న్స్‌ని కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆమోదం తెలిపి చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనువైన భూమి ఇప్పటికే గుర్తించినప్పటికీ, ఇప్పటికీ నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. ఈ అంశాలపై ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు ఎంపీ తెలిపారు.
హెచ్‌ఎంపై డీఈవో ఆగ్రహం
ఏర్పేడు: మండలంలోని పాపానాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్. కుమార్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఇందులో విద్యార్థుల రోజువారీ సగటు హాజరుకు మించి కోడిగుడ్లను అధికంగా ఇండెంట్ చేసి పాఠశాలకు సరఫరా చేయించడమే కాకుండా, వాటినే సుమారు నెల రోజుల పాటు విద్యార్థులకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారం పై డీఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీచేసి, పూర్తి వివరణ సమర్పించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాలు, విషయ పరిజ్ఞానం, నేర్చుకునే స్థాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సూచనలు జారీ చేశారు. రోజువారీ సగటు విద్యార్థుల హాజరును అనుసరించి మాత్రమే కోడిగుడ్లు, చిక్కీలకు ఇండెంట్ ఇవ్వాలని తెలిపారు.


