సాక్షి టాస్క్‌ఫోర్స్ : ‘‘అన్నా పెద్దపంజాణి మండలంలో టీడీపీ మునిగిపోయే నౌక’’ అంటూ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ మురళి సోషల్ మీడియాలో లైవ్ పెట్టిన వీడియో పలమనేరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అందులో ఆయన ఏమన్నారంటే..’’ ఎమ్మెల్యే అమరన్న మీరంటే నాకెంతో గౌరవం. కానీ, గత ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి సోషల్ మీడియాలో ఎంతో కీలకంగా పనిచేసిన మాలాంటి వారికి ముఖ్యంగా మండలంలోని యూత్‌కు ఇప్పు డు ఏమాత్రం పార్టీలో విలువ లేకుండా పోయింది. పార్టీ కోసం ఏమాత్రం పనిచేయని వారు నేడు అధికారం అనుభవిస్తునానరు. వారికే మీరు వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పార్టీ కార్యక్రమాలకు కూడా బీసీననే చిన్నచూపుతో సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పార్టీ మునిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్ వీడియో వైరల్‌గా మారింది.
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి
బైరెడ్డిపల్లె : పలమనేరు– కుప్పం జాతీయ రహదారిలోని దేవదొడ్డి సమీపంలో మలుపు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో వి.కోట పంచాయతీ బిల్‌కలెక్టర్ సాధిక్‌ఆలీ (49) మృతి చెందాడు. వివరాలు.. బైరెడ్డిపల్లెకు చెందిన నజీర్‌బాషా కుమారుడు సాధిక్‌ఆలీ వి.కోట పంచాయితీలో బిల్‌కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరై ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా ఐషర్ వాహనం ఢీ కొంది. దీంతో తీవ్రంగా గాయపడిన సాధిక్ ఆలీని 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. ప్రమాదానికి కారణమైన ఐషర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నెల రోజుల క్రితం మృతుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. సాధిక్ మృతితో బైరెడ్డిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైరెడ్డిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


